దిశ దశ, హైదరాబాద్:
అవినీతికి పాల్పడడమే నేరమంటే… విధ్వంసాలకు ఉపయోగించే పేలుడు పదార్థాల విషయంలోనూ లంచం అడుగుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. పేలుడు పదార్థల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సింది పోయి… అవినీతి కోసం కారుణ్యాన్ని ప్రదర్శించేందుకు సాహసించిన తీరు ఆందోళన కల్గిస్తోంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ ఎస్సై పేలుడు పదార్థాలు లభ్యమైన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం కావాలని అడిగిన తీరు పోలీసు విభాగానికే మచ్చ తెచ్చే విధంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని తిలక్ నగర్ కాలనీకి చెందిన డి వెంకటేశ్ అనే వ్యక్తి ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయి. అయితే ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలని వెల్దండ ఎస్సై ఎం రవి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మీడియేటర్ ద్వారా లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.
102 డ్రైవర్ ద్వారా…
కల్వకుర్తి ఆసుపత్రికి చెందిన 102 అంబూలెన్స్ డ్రైవర్ జి విక్రం ద్వారా లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మీడియేటర్ గా వ్యవహరించినందుకు విక్రంను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు ఏసీబీ అధికారులు. చట్ట వ్యతిరేకంగా మధ్యవర్తిత్వం చేయడం కూడా నేరమే కావడంతో పాటు, అవినీతి అధికారిని ప్రోత్సహించే విధంగా బాదితుల నుండి లంచాలు వసూలు చేసినందుకు డ్రైవర్ విక్రం కూడా కటకటాలపాలు కావల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో అతనికి ఎంత వాటా వస్తుందో తెలియదు కానీ… ఉద్యోగం పోవడంతో పాటు జైలు జీవితం గడిపాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.
వాటిని ఏం చేసేవారు…?
వెల్దండ ఎస్సై రవి లంచం ఇస్తే పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసు నమోదు చేయనని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ బాధితుని నుండి డబ్బులు తీసుకున్న తరువాత స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిని తిరిగి నిందితునికే అప్పగించే అవకాశం ఉండేది. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకోనట్టయితే లంచం తీసుకున్న తర్వాత ఎక్స్ ప్లోజివ్ మెటిరియల్ అంతా కూడా నిందితుని ఇంటికి చేరేది. తిరిగి ఆయన వాటిని అక్రమంగా అమ్మకాలు జరిపిన క్రమంలో ఎక్కడైనా పేలుడు సంభవిస్తే సామాన్యులు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చేది. అత్యంత ప్రమాదకరమైన వాటి విషయంలో కూడా అవినీతి కోసం ఉదారతను ప్రదర్శించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.