నిర్వీర్యం చేసిన బలగాలు…
దిశ దశ, దండకారణ్యం:
సరిహద్దు అడవుల్లో అడుగు తీసి అడుగేయాలంటేనే ఆందోళనకరంగా మారింది. ఓ వైపున బూబీట్రాప్స్, మరో వైపున పేలుడు పదార్థాల నడుమ బలగాలు నక్సల్స్ ఏరివేత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎటు వైపు నుండి ముప్పు వాటిల్లుతుందో తెలియని భయానక పరిస్థితుల్లో బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల ఖిల్లాగా పేరుగాంచిన తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో బలగాలను డిఫెన్స్ లో పడేయాలన్న ప్రయత్నాలను నక్సల్స్ ముమ్మరంగా చేస్తున్నారు. నక్సల్స్ కోసం అటవీ ప్రాంతంలో కాలినడకన వెల్తూ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించే బలగాలను లక్ష్యం చేసుకుని మావోయిస్టులు బీరు సీసాల్లో మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేశారు. మందుబాబులు తాగి పడేసిన సీసాలుగా భావించి బలగాలు పట్టించుకునే అవకాశం లేదన్న ఉద్ధేశ్యంతోనే మావోయిస్టులు బీరు సీసాల్లో పేలుడు పదర్థాలు అమర్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పుసగుప్ప అటవీ ప్రాంతంలో బీరు బాటిళ్లను గుర్తించిన 81వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తం అయ్యారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మూడు బీరు సీసాలను, గమనించిన కూంబింగ్ పార్టీలు వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. బీరు బాటిళ్లను మట్టిలో తవ్వి పెట్టి వైర్లు కూడా కనెక్ట్ చేసి పెట్టిన నక్సల్స్ అదను చూసి బలగాలను టార్గెట్ చేసినట్టయితే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అంచనా వేశాయని తెలుస్తోంది. అయితే సీఆర్పీఎఫ్ బలగాలు వాటిని ముందుగానే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పినట్టయింది. మందుగుండును బీరు సీసాలో పెట్టి పేల్చడం వల్ల కూంబింగ్ పార్టీలపై లోపల ఉన్న ఇనుమ ముక్కలతో పాటు బీరు సీసా శకలాలు కూడా తగలడంతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించే బలగాలు తీవ్ర గాయాల పాలయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూంబింగ్ ఆపరేషన్లపై ప్రభావం చూపుతుందని నక్సల్స్ భావించి ఉంటారని అనుకుంటున్నారు. కానీ బలగాలు ముందుగానే మందుగుండు అమర్చిన బీరు సీసాలను గుర్తించడం వల్ల మావోయిస్టుల వ్యూహానికి చెక్ పెట్టినట్టయింది.