సమాంతర కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకే…
బల్రాజ్ చర్యలపై సునిశిత పరిశీలన: అభయ్
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ మరో కీలక నేతపై బహిష్కరణ వేటు వేసింది. గత కొంతకాలంగా ఉద్యమానికి నష్టం కల్గించే చర్యలకు పూనుకోవడంతో పాటు పార్టీ తీర్మానాలను అమలు చేయడంలో విఫలం అయినందున ఆయనపై ఆ చర్యలు తీసుకున్నామని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పొలిట్ బ్యూరో మెంబర్ గా, కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేసిన బల్రాజ్ అలియాస్ బచ్చా ప్రసాద్ సింగ్ ను మావోయిస్టు పార్టీ నుండి బహిష్కరించినట్టు పేర్కొన్నారు. ఉత్తర రీజనల్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన కేంద్ర కమిటీ నిర్దేశించిన రహస్య పనివిధానానికి స్వస్తి పలికాడన్నారు. కుటుంబంతో బహింరంగంగా సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లే 2009లో ఆయన అరెస్టుకు దారి తీసిందని, ఆ తరువాత శతృవు ముందు విప్లవ ధృడత్వాన్ని ప్రదర్శించకుండా, పార్టీ రహస్యాలను కాపాడడంలో విఫలం అయ్యాడన్నారు. ఆయన జైలు జీవితంతో పాటు బయటకు వచ్చిన తరువాత ఆత్మ విమర్శ చేసుకుని సీసీ కమిటీ ఇచ్చిన సూచనలు పాటించి రహస్య జీవితాన్ని గడపడడంలో కూడా విఫలం అయ్యాడని అభయ్ వివరించారు. తరుచూ అరెస్ట్ అవుతూ ఈ సమాచారాన్ని కేంద్ర కమిటీకి చేరవేయకుండా, పార్టీ తీర్మానాలను అమలు చేయకుండా, తొమ్మిదవ ఐక్యతా కాంగ్రెస్ రూపొందించిన నిబంధనలను, కేంద్ర కమిటీ నిర్ణయాలను ఘోరంగా ఉల్లంఘిస్తూ వచ్చాడని అభయ్ పేర్కొన్నారు. రాజకీయ, సైనిక నిర్మాణ పంథాలకు వ్యతిరేకంగా ముఠా రాజకీయాల్లో మునిగిపోయాడని, ఈఆర్బీ బాధ్యుడితో కలవడానికి కూడా నిరాకరించాడని అభయ్ తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తర బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హరియాణ, ఢిల్లీలకు చెందిన కొంతమంది విప్లవకారులను కలుపుకుని సమాంతర కేంద్రాన్ని నెలకొల్పాడని, ‘పార్టీ నాయకత్వ కామ్రేడ్స్ సమావేశం’ పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అభయ్ వివరించారు. మావోయిస్టు పార్టీ 8వ కేంద్ర కమిటీ సమావేశంలో బల్రాజ్ వ్యవహరించిన తీరుపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత అతన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్టు అభయ్ ప్రకటించారు.