వివాహేతర బంధాలు విస్తూపోయే నిజాలు

నల్ల బంగారాన్ని వెలికి తీసే ఆ ప్రాంతంలో నెలకొన్న చీకటి కొణాలెన్నో… సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో దాగి ఉన్న నేర మయ ప్రపంచం ఎంతో..? నిన్న మొన్నటి వరకు దారి తప్పిన వారసుల గురించి కథలు కథలుగా వినిపించిన గోదావరి పరివాహక ప్రాంతం నేడు వివాహ బంధాలకు మాయని మచ్చగా తయారు కావడం వెనక ఉన్న అంశాలెన్నొన్నో… గోదావరిఖని గంగానగర్, మంచిర్యాల గుడిపల్లి ఘటనలే ఇందుకు ఉదాహారణ. నేర మయ ప్రపంచంతో నిండు నూరేళ్లు జీవించాల్సినప్పటికీ కొంతమంది కానరాని లోకలకు చేరిపోతుంటే ఇంకొందరు కటకటాల పాలవుతున్నారు. కుటుంబ వ్యవస్థకే మాయని మచ్చగా తయారైన వివాహేతర బంధాలే ఇందుకు కారణమని పోలీసుల విచారణలో తేలుతుండడం బాధాకరం.

గోదావరిఖని గంగానగర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

గోదావరిఖనిలో…

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని గంగానగర్ లో మూడు నెలల క్రితం తెల్లవారు జామున ఓ హత్య జరిగింది. రాజేందర్ అనే కార్మికుని ఇంట్లోకి చొరబడిన అగంతకులు తుపాకితో కాల్పి చంపి పరార్ అయ్యారు. తాను వాష్ రూంలోకి వెల్లొచ్చేసరికి హత్య చేసి వెల్లారంటూ రాజేందర్ భార్య రవళి కట్టకథ అల్లింది. అయితే రాజేందర్ నిద్రిస్తున్న సమయంలో నిందితులు ఇంట్లోకి ఎలా వచ్చారన్నదే పజిల్ గా మారిపోవడంతో పాటు రవళి కదకలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెపై ఓ కన్నేసి సాంకేతిక ఆధారాల కోసం సెర్చ్ చేశారు. తెల్లవారు జామున ఇద్దరు వ్యక్తులు ఓ బైక్ పై రాజేందర్ ఇంటి వైపు వస్తున్నట్టుగా ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడం, ఇంటి తలుపులు ఎవరు తెరిచారోనన్న విషయాన్నిబేస్ చేసుకుని పోలీసులు కూపీ లాడంతో గుట్టు రట్టయింది. దీంతో రవళి ఈ హత్యకు స్కెచ్ వేసినట్టు నిర్దారించిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. చదువుకునేప్పుడు పరిచయం అయిన రాజుతోనే సహజీవనం చేయాలని భావించిన రవళి తన భర్త వద్ద ఉన్న రూ. 2 లక్షలు ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ చేయించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గుబావిలో పనిచేసే రాజేందర్ ను అంతకుముందు యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆ తరువాత రాజేందర్ ఇంటి గేటుకు కరెంట్ షాక్ పెట్టి హత్యకు ప్లాన్ చేసినా సక్సెస్ కాలేకపోయారు. దీంతో రాజేందర్ ను తుపాకితో కాల్చి చంపాలని నిర్ణయించుకున్న రవళి, రాజులు అతని డబ్బులతోనే రూ లక్ష వెచ్చించి బీహార్ లో వెపన్ కొనుగోలు చేయించారు. రాజేందర్ నిద్రిస్తుండగా తెల్లవారు జామున ఇంటి తలుపులు తీయగానే లోపలకు వచ్చిన రాజు అతని స్నేహితులు ఇద్దరు కలిసి రాజుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి మర్డర్ చేసి పరార్ అయ్యారు. ఒక్కో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ ముందుకు సాగిన గోదావరిఖని పోలీసులు గంటల వ్యవధిలోనే సింగరేణి కార్మికుడు రాజేందర్ హత్య కేసు మిస్టరీని ఛేదించారు.

గంగానగర్ హత్య కేసులో నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆరుగురి సజీవ దహనం

తాజాగా మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో జరిగిన హత్యకు కూడా మెయిన్ కాజ్ వివాహేతర బంధాలేనని తేలడం గమనార్హం. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం ఘటన ముందుగా ప్రమాదవశాత్తు జరిగిందని భావించినప్పటికీ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక్కో విషయాన్ని బయటకు లాగడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మాసు పద్మ అలియాస్ రాజ్యలక్ష్మితో సింగరేణిలో సర్దార్ గా పనిచేస్తున్న శాంతయ్యకు గత కొంతకాలంగా వివాహేతర బంధం ఏర్పడింది. దీంతో చాలా కాలంగా శాంతయ్య తన భార్య సృజన వద్దకు వెల్లకుండా మాసు పద్మతోనే సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సృజనకు కూడా లక్షెట్టిపేటకు చెందిన రియాల్టర్ లక్ష్మయ్యతో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర బంధం వరకూ చేరింది. రెండు వివాహేతర బందాల మధ్య సాగుతున్న క్రమంలో శాంతయ్య తన భూమిని విక్రయించగా రూ. 18 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు సృజనకు ఇవ్వకపోవడంతో వాటిని మాసు పద్మకే ఇచ్చాడన్న అనుమానం, ఇదే సమయంలో శాంతయ్య డిపెండెంట్ ఉద్యోగాన్ని పద్మ కొడుక్కు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని కూడా భావించిన సృజన అమె పిల్లలు కలిసి శాంతయ్యను, పద్మపై కోపం పెంచుకున్నారు. వీరిద్దరిని హత్య చేస్తే తప్ప తమ ఆస్థితో పాటు ఉద్యోగం తమకు దక్కదని భావించి పలుమార్లు రెక్కి నిర్వహించారు. అప్పుడు తమ స్కెచ్ ఫెయిల్ కావడంతో ఇక వారి ఇంట్లోనే చంపేయాలని భావించి పక్కా ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి పెట్రోల్ బంక్ లో క్యాన్లలో పెట్రోల్ నింపుకుని నేరుగా మాసు పద్మ ఇంటికి చేరుకుని ఇల్లంత చల్లి నిప్పంటించడంతో సజీవ దహనం ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మ, శాంతయ్యలే నిందితుల లక్ష్యం కాగా పద్మ భర్త శివయ్య ఆమె అక్క కూతురు మౌనిక ఆమె పిల్లలు స్వీటి, హిమబిందులు చనిపోయారు.

మంచిర్యాల జిల్లా గుడిపల్లి ఆరుగురి సజీవ దహనం ఘటన స్థలాన్ని సందర్శించిన సీపీ చంద్రశేఖ్ రెడ్డి

అభం శుభం తెలియని…

వివాహేతర బంధాల కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్నంగా మారిపోతున్నాయి. పెద్దలు చేసిన తప్పిదాలకు అభం శుభం తెలియని చిన్నారులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోతోంది. గోదావరిఖనిలోని గంగానగర్ ఘటనలో రాజేందర్ హత్యకు గురికావడం ఈ కేసులో ఆయన భార్య రవళిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ చిరు ప్రాయంలో తల్లిదండ్రులకు దూరం కావల్సి వచ్చింది. గుడిపల్లి ఘటనలో మౌనిక బిడ్డలిద్దరు కూడా సజీవ దహనం కావడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది.

వివాహేతర బంధాలే…

ఈ రెండు ఘటనల్లో కూడా వివాహేతర బంధాలే ప్రాణాలు తీసే పరిస్థితికి చేర్చాయని తేటతెల్లం అవుతోంది. గోదావరిఖని గంగానగర్ లో రాజేందర్ హత్య ఘటనలో రవళి, రాజులకు మధ్య చిన్నప్పటి నుండి ఏర్పడిన సాన్నిహిత్యం ఇంత దూరం తీసుకవచ్చింది. అయితే గుడిపల్లి ఆరుగురి సజీవ దహనంలో రెండు వివాహేతర బంధాలు చోటు చేసుకోవడం విస్మయపరుస్తోంది. మాసు పద్యతో శాంతయ్య సహజీవనం చేస్తుండగా, శాంతయ్య భార్య సృజన లక్ష్మయ్యతో వివాహేతర బంధంతో జీవనం సాగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర బంధాల కారణంగానే హత్యలు చేసే స్థాయికి చేరుకోవడం స్థానికులను విస్మయ పరుస్తోంది. అడ్డుగా ఉన్నారని ఓ చోట, ఆస్థుల కోసం మరోచోట జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏది ఏమైనా సింగరేణి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండడం చర్చకు దారి తీస్తోంది.

గుడిపల్లిలో సజీవ దహనంలో చనిపోయిన పద్మ, శివయ్య దంపతులు

అప్పుడలా…

కొంతకాలం క్రితం వరకు సింగరేణి విస్తరించిన ప్రాంతంలో యువత నేర ప్రవృత్తిపై ఎక్కువగా ఉండే వారు. వారిపై అజమాయిషీ చేసే వారు లేకపోవడంతో అప్పుడు యువత చెడు దారిలో పయనిస్తూ నేరాలకు పాల్పడే వారు. పోలీసులకు సవాల్ గా నిలిచిన ఆ నాటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఎన్నో రకాలుగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కార్మికులు విధులు ముగించుకుని ఇంటికి చేరగానే సహచరులతో పార్టీలు చేసుకుని రెస్ట్ మూడ్ లోకి వెల్లిపోతుండడంతో వారి పిల్లలను కట్టడి చేసే పరిస్థితులు లేకుండా పోయాయని గమనించిన పోలీసు అధికారులు కౌన్సిలింగ్ లు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టారు. చివరకు వీరికి సింగరేణి సౌజన్యంతో వివిధ అంశాల్లో శిక్షణలు ఇప్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, కేసులు నమోదు కావడం వల్ల జరిగే నష్టం, జీవితాలు ఎలా నాశనం అవుతాయోనన్న తదితర విషయాలపై సమగ్రంగా యువతకు వివరించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. దీంతో సింగరేణి ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన నేరాల తీరుతెన్నుల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఇదే ప్రాంతంలో సరికొత్త సమస్య ఉత్పన్నం అయిందని చెప్పకతప్పుదు. వివాహేతర బంధాలతో భర్తలను కడతేర్చేందుకు భార్యలే సాహసిస్తుండడం ఆందోళన కల్గిస్తున్న విషయం. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత సింగరేణి ప్రాంతంలో ఉందని తేటతెల్లం చేస్తున్నాయి ఈ ఘటనలు.

You cannot copy content of this page