దాచినా దాగని నిజం… నివేదిక ఇచ్చిన కేంద్ర బృందం

మేడిగడ్డలో వాటర్ స్టోరేజ్ ఉండొద్దు…

మెయింటనెన్స్ వైఫల్యాలు ఉన్నాయి…

దిశ దశ, భూపాలపల్లి:

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. మేడిగడ్డ లోపాలకు వెలుగులోకి రాకూడదని ప్రయత్నించినా ఎదో రకంగా అవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికతో బ్యారేజీ నిర్మాణంలో చూపించిన డొల్లతనం అంతా బహిర్గతం అయింది. అసలే ఎన్నికల వేళ బ్యారేజీ కుంగిపోవడంతోనే పెద్ద సమస్య ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిపుణల బృందం ఇచ్చిన నివేదిక మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా అయింది.

11 అంశాల వివరాలే…

అయితే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 20 అంశాల వివరాలు ఇవ్వాలని కేంద్ర బృందం అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఇరిగేషన్ అధికారులు ఇచ్చారని, అవి కూడా అసంపూర్తిగానే ఉన్నాయని కమిటీ పేర్కొంది. వర్షాకాలం ముందు తరువాత బ్యారేజీకి సంబంధించిన ఇన్స్ పెక్షన్ రిపోర్టులు, కంప్లీషన్ రిపోర్టులు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, థర్డ్ పార్టీ మానటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు, తర్వాత నది కొలతను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్ లకు సంబంధించిన డేటాను ఇరిగేషన్ అధికారులు అందించలేదని కమిటీ పేర్కొంది. కేంద్రం బృందం అడిగినా ఇవ్వని 9 అంశాలకు సంబంధించిన పరీక్షలు ఇంజనీర్లు చేపట్టలేదని భావిస్తోంది. ఒకవేళ సంబంధిత రిపోర్టులు ఉండి కూడా కేంద్ర బృందానికి ఇవ్వనట్టయితే డ్యామ్ సేఫ్టీ యాక్డ్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారి తీయవచ్చని కూడా నిపుణుల బృందం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు స్పష్టం చేసింది.

బేస్ సరిగా లేకే…

బ్యారేజీలోని పిల్లర్లు కూలిపోవడానికి ప్రధాన కారణం బేస్ ఫౌండేషన్ కు సంబంధించిన నిర్మాణంలో పటిష్టమైన మెటిరియల్ వినియోగించలేదని, తక్కువ మోతాదులో వినియోగించడంతో బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడంతో పిల్లర్ సపోర్ట్ బలహీనపడినట్టుగా నిపుణులు తేల్చారు. బ్యారేజ్ లోడ్ వల్ల ఎగువన ఉన్న సెకాంట్ ఫైల్స్ (కాంక్రీట్) పటిష్టంగా లేకపోవడం కూడా మరో కారణంగా పేర్కొంది. బ్యారేజ్ ప్లానింగ్ కు డిజైన్ కు పొంతన లేకుండా నిర్మాణం జరిగిందని, 2019లో ప్రారంభించినప్పటి నుండి ఇంజనీర్లు పిల్లర్లు, కాంక్రిట్ దిమ్మెలు, లాంచింగ్ అప్రాన్లలను పరిశీలించడమే కాకుండా మెయింటనెన్స్ కూడా చేయకపోవడంతో క్రమక్రమంగా బ్యారేజీ బలహీనపడిపోయిందని బృందం గుర్తించింది. వర్షాకాల ముందు, తరువాత బ్యారేజీని తనఖీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు పలుమార్లు సూచించినా పాటించలేదని వెల్లడించింది. డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021లోని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, చాప్టర్ Xలోని 41(బి) సెక్షన్ కింద తీసుకోవల్సిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సెంట్రల్ టీం పేర్కొంది. డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021లోని అనేక నిబంధనలు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజషన్ విస్మరించిందని ఇది చాలా ఘోరమైన తప్పిదమని అభిప్రాయపడింది. మేడిగడ్డ ఒక్క బ్లాకులో ఏర్పడిన ఈ సమస్య వల్ల మొత్త బ్యారేజీ సరిగా పనిచేయని పరిస్థితి నెలకొందని, తాజాగా ఎదురైన పిల్లర్ల కుంగుబాటు సమస్యను పరిష్కరించే వరకూ దానిని ఉపయోగించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని టీం తేల్చింది. పిల్లర్లు కుంగిపోయిన 7వ బ్లాక్ మొత్తాన్ని పునాదులతో సహా తొలగించి నూతన నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అయితే ఈ బ్యారేజీలోని ఇతర బ్లాకులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందని నిర్మాణం తీరును పరిశీలిస్తే అర్థమవుతుందని గుర్తించింది. ఇలాంటి పరిస్థితే ఎదురైతే బ్యారేజీ మొత్తాన్ని కూడా తొలగించి నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని కూడా కేంద్ర బృందం తేల్చి చెప్తోంది. ఎదురయిన సమస్యను పరిష్కరించుకోక ముందే బ్యాక్ వాటర్ స్టోరేజీ చేసినట్టయితే డ్యామేజీ మరింత పెరిగే అవకాశం ఉందని 7వ బ్లాకును పునరుద్దరించిన తరువాతే నీటి నిలువ చేయకూడదని సూచించింది.

అవి కూడా…

మేడిగడ్డ బ్యారేజీలాగానే నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ఇలాంటి సమస్యే ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదని కూడా కేంద్ర నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇప్పటికే అన్నారం బ్యారేజీకి దిగువన బాయిలింగ్ (ఊబి) సమస్య ఎదురయిందన్న విషయాన్ని కూడా కమిటీ పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పైపింగ్ సమస్యలను గుర్తించేందుకు మేడిగడ్డతో పాటు వెంటనే తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా కమిటీ వెల్లడించింది.

You cannot copy content of this page