పుట్టుకొస్తున్న డాక్యూమెంట్లు…

పెరిగిపోతున్న పంచాయితీలు…

దిశ దశ, కరీంనగర్:

భూమి ఒకటే… డాక్యూమెంట్లు మాత్రం ఎన్నో… ఎలా తయారవుతున్నాయో తెలియదు… ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయో తెలియదు కాని ఒకే భూమి పేరిట క్రియేట్ అవుతున్న డాక్యూమెంట్లతో భూ యజమానులు రోడ్డుపై పడితే అక్రమార్కులు అర్థికంగా బలపడిపోతున్నారు. ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేసే గ్యాంగుల వ్యవహారంతో భూ దందాల సమస్యలు ఝటిలంగా మారిపోతున్నాయి. తాజాగా మానకొండూరు మండలంలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. చెంజర్ల సమీపంలో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కంపౌండ్ వాల్ నిర్మించుకుంటుండగా ఈ భూమి తమదేనంటూ కొంతమంది వ్యక్తులు ప్రత్యక్ష్యం అయ్యారు. ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి షాకుకు గురై అమ్మిన భూ యజమానులకు సమాచారం ఇచ్చాడు. దశాబ్దాల కాలంగా తాము సాగు చేసుకుంటున్న భూమిలోకి ఎలా వచ్చారంటూ ఆగ్రహించి వారిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన రాజుగౌడ్, కర్ణాకర్, దివాకర్ లపై సీడ్ ప్లాంట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మానకొండూరు సీఐ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే రేణిగుంటకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సీడ్ ప్లాంట్ యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.

దర్జాగా ముఠాలు…

కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు కోట్లకు పెరగడంతో నకిలీ డాక్యూమెంట్లతో హల్ చల్ చేస్తున్న ముఠాలు రాజ్యమేలుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కూడా ఈ వ్యహారాలకు పాల్పుడుతుండడంతో పోలీసులు వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నేతల నుండి ఒత్తిళ్లు వస్తుండడంతో క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలిసినా కిమ్మనకుండా ఉండాల్సిన పరిస్థితి తయారవుంతోంది. ఇదే అదనుగా కొంతమంది పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరిస్తుండడం వల్ల భూ యజమానుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వెన్నుదన్నుగా నిలిచే వారు లేని వారినికి కోర్టుకు వెళ్లాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. ముఠాలు మాత్రం దర్జాగా డాక్యూమెంట్లు క్రియేట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కొన్ని చోట్ల భూములకు సంబంధించిన సర్వెేనెంబర్లకు బై నంబర్లు నెంబర్లు వేసి భూముల్లోకి చొరబడుతున్న సంఘటనలు కూడా లేకపోలేదు. అయితే డాక్యూమెంట్లు క్రియేట్ చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై హిస్టరీ షీట్స్ వంటివి ఏర్పాటు చేస్తే తప్ప ఈ పరిస్థితులకు పుల్ స్టాప్ పడే పరిస్థితి లేకుండా పోయింది. కరీంనగర్ కు చెందిన ఓ రిటైర్డ్ మెడి్కల్ ఆఫీసర్ కు కూడా ఇలాగే భూమిని విక్రయించిన ఘరానా మోసగానికి వెన్నుదన్నుగా అధికారపార్టీ నాయకులు నిలుస్తుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయింది. అసలు భూమే లేకున్నా దర్జాగా భూమిని అమ్మి డబ్బులు వసూలు చేసుకున్న ఛీటర్స్ దర్జాగా తిరుగుతుంటే మాయమాటలతో మోసపోయిన బాధితులు న్యాయం చేయండంటూ అందరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి తయారైంది.

అధికార పార్టీకి ఎఫెక్ట్…

అయితే ల్యాండ్ మాఫియాలు చేస్తున్న దందాలా ఎఫెక్ట్ అధికార పార్టీ నాయకులపై తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్య నాయకుల అనుచరులు మానిటరింగ్ చేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియాపై ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీ నాయకుల కనునస్నల్లోనే ల్యాండ్ మాఫియా అంతా తమ పబ్బం గడుపుకుంటోందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నాటుకపోయిన పరిస్థితుల్లో బాధితుల గోడు కళ్లార చూస్తున్న సామాన్యులు కూడా ఓటు రూపంలో తీర్పునిస్తే ఓడలు బండ్లుగా… బండ్లుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రౌండ్ రియాల్టీ విషయంలో అధికార పార్టీ క్రాస్ చెక్ చేసుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టనట్టయితే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page