ముగ్గురి అరెస్ట్… ఒకరి పరార్…
దిశ దశ, కరీంనగర్:
ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు ఆక్రమణలకు పాల్పతున్న వారిపై కొరడా ఝులిపించడం ఆపలేదు. తప్పు దారుల్లో భూములను ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసిన వారిని అరెస్ట్ చేసే పనిలోనే పోలీసులు నిమగ్నం అయ్యారు. తాజాగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులు మరో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ లోని ఫతేపురాలో నివాసం ఉంటున్న షేక్ అబూబాకర్ 1992లో రేకుర్తి శివార్లలోని సర్వే నంబర్ 79/2లో 8.12 ఎకరాల భూమిని సాలెహ్ బీ వద్ద కొనుగోలు చేశారు. 1996లో్ ఈ భూమిని ప్లాట్టుగా మార్చి పలువురికి విక్రయించగా ప్లాట్ నంబర్ 311లోని 200 గజాల స్థలాన్ని గొర్ల లక్ష్మికి విక్రయించారు. ఆ స్థలాన్ని 2010లో మేడిశెట్టి లచ్చయ్యకు విక్రయించగా ఆయన 2011లో గుర్రం బాల నరేందర్ కు అమ్ముకున్నారు. అయితే ఈ ప్లాట్ ను ఆనుకుని ఉన్న 312, 313 ప్లాట్లలోని 400 గజాల స్థలాన్ని షేక్ అబూబకర్ ఎవరికీ విక్రయించకుండా తన పేరిటనే అట్టిపెట్టుకున్నారు. అయితే ఈ 400 గజాల స్థలాన్ని కాజేయాలన్న దురుద్దేశ్యంతో 311 ప్లాట్ యజమానిగా ఉన్న బాల నరేందర్, గుర్రం రాజయ్య, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావులు పథకం పన్నారు. రేకుర్తి గ్రామ పంచాయితీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు ఇంటి నంబర్ సృష్టించి 2022లో్ గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసుకున్నారు. ఆ తరువాత సప్లిమెంట్ డీడ్ ద్వారా 312, 313 ప్లాటర్లను రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేయించి 312 ప్టాట్ ను చీటి ఉపేందర్ రావు పేరిట, 313 ప్లాట్ ను ఉప్పు శ్రీనివాస్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తారుమారు చేసిన వీరు యజమాని అబూబాకర్ ను చంపుతామని కూడా బెదిరించారు. దీంతో ఆయన కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు గుర్రం బాల నరేందర్, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావు, గుర్రం రాజయ్యలపై 420, 467, 468, 471, 120-B, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. వీరిలో గుర్రం రాజయ్య పరారీలో ఉండగా మిగతా ముగ్గురిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.