కార్యాలయంతో సంబంధం లేకుండానే…
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
కార్యాలయంతో సంబంధం లేకుండానే డాక్యుమెంట్లు పుట్టుకొస్తున్నాయా..? నకిలీ డాక్యూమెంట్లను బేస్ చేసుకుని కోర్టులను ఆశ్రయిస్తున్నారా..? సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో అసలు గుట్టు బట్టబయలు అయింది.
సిరిసిల్లలో…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు గ్రామంలో ఓ స్థిరాస్థికి సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. కేసు వేసిన వారు ఆస్థికి సంబంధించిన యజమాని ఇరుకుల్ల సదానందం భూమిని తమకు విక్రయించాడని, రిజిస్ట్రేషన్ చేసుకోకముందే చనిపోవడంతో అతని కుమారున్ని అడిగినప్పటికీ లాభం లేకపోయిందని తనకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాను కొనుగోలు చేసిన స్థిరాస్థికి సంబంధించిన డాక్యూమెంట్లను కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంపోండింగ్ చేశారని కూడా కోర్టుకు సమర్పించారు. అయితే స్థిరాస్థి యజామాని సదానందం బంధువులు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇవ్వాలని అడగగా తమ కార్యాలయంలో ఇంపోండింగ్ కాలేదని రిజిస్ట్రేషన్ కార్యాలయ నుండి సమాదానం ఇచ్చారు. దీంతో తమ ప్రాపర్టీకి సంబంధించిన లావాదేవీలు జరిగినట్టుగా ప్రత్యర్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలు క్రియేట్ చేశారని సదానందం వారసులు అంటున్నారు. 2004లో కొనుగోలు చేసినట్టుగా తయారు చేసిన సాదా బైనామాపై 2006లో ఇంపోండింగ్ చేసినట్టుగా డాక్యూమెంట్లు కోర్టులో సమర్పించారని, ఏకంగా రిజిస్ట్రేషన్ అధికారుల సంతకాలు, స్టాంపులను కూడా వినియోగించుకున్నారని ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ…
సిరిసిల్లలో సర్కారు భూములను ఆక్రమించుకున్న వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ భూములను కలెక్టర్ కు తిరిగి అప్పగిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో చులకన అవుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఇరుకుల్ల సదానందంకు సంబంధించిన భూమి విషయంలో కూడా ఇంపోండింగ్ చేసినట్టుగా నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసిన వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడేనని సదానందం వారసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫేక్ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు. ఇంపోండింగ్ చేసినట్టుగా అతనితో డాక్యూమెంట్లు క్రియేట్ చేయించడమో లేక వేరే వారితో తయారు చేయించి ఉంటారని సదానందం వారసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.