జర్నలిస్టు ముసుగులో జనాలను ముంచుతూ…

అడ్డంగా బుక్ అయిన నకిలీ విలేకరి

దిశ దశ, మెదక్:

డబ్బు సంపాదించేందుకు ఓ వృత్తిని ఎంచుకోవడం అలా చెలామణి కావడం అడ్డంగా బుక్ అయిపోవడం సాధారణంగా మారిపోయింది చాలమందికి. ఇందులో క్రేజీ ఉన్న ప్రొఫెషన్ అయితే మరీ బావుంటుందని ఆ వేషం వేసుకుని అందినకాడికి దోచుకుంటూ దర్జాగా బ్రతుకుతున్నారు కొందరు. తాజాగా జర్నలిస్టనంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ప్రబుద్దుడిని మెదక్ జిల్లా నర్సాపూర్ పో్లీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక సీఐ ఎస్ కె లాల్ మధార్, ఎస్సీ జె శివ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన ఆగు తిమ్మారెడ్డి గారి విభీషణ్ రెడ్డి (43) రిపోర్టర్ నంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఛీటింగ్ కు పాల్పడుతుండడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. గతంలో రిపోర్టర్ గా పనిచేసిన విభీషణ్ రెడ్డి చిరు వడ్డీ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పోలీసులు ఓ సారి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపిచారు. అయినప్పటికీ ఈజీ మనీ సంపాదించేందుకు అలవాటు పడ్డ ఈ ఘనుడు మోసాలకు పాల్పడడం మాత్రం మానలేదు. నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ కు చెందిన ఓ మహిళ బ్రతికుండగానే చనిపోయిందని ఫేక్ డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేశాడు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా నర్పాపూర్ శివార్లలోని 60 గుంటల భూమిని పట్టా మార్పిడీ చేయిస్తానని నమ్మించి రూ. 3 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఏకంగా ధరణీలో స్లాట్ బుక్ చేసి రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న క్రమంలోనే నిందితుడు బీవీఆర్ఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. సదాశివపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఈ కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఈ ఘనుడు ఇంజనీరింగ్ సీట్ కోసం రూ. 4 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నమ్మకం ఉంచిన బాధితుడు వేరే కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించలేదు. అకాడమిక్ స్టార్ట్ అవుతున్నా తన అడ్మిషన్ విషయం ఏమైందని అడిగితే తప్పించుకుని తిరగడంతో అనుమానించి పోలీసులను ఆశ్రయించారు. ఇలా మెసాలకు పాల్పడుతూ అలవోకగా డబ్బులు సంపాదిస్తూ జీవితాలతో చెలగాటమాడుకుంటున్న విభీషణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీఐ ఎస్ కె లాల్ మధార్ తెలిపారు. ఇతని మాయ మాటల వలలో చిక్కుకుని ఎవరూ నష్టపోకూడదని ఆయన సూచించారు.

You cannot copy content of this page