నకిలీ విలేకరుల స్పెషల్ పెట్రోలింగ్… పోలీసులకు ధీటుగా గస్తీ…

ఏడుగురి అరెస్ట్: ఏసీపీ వెంకటేశ్వర్లు

దిశ దశ, చెన్నూరు:

ఓ వాహనం… అందులో కొంతమంది యువకులు… ప్రాణహిత పరివాహక ప్రాంతంలో నిరంతరం నిఘా… అటుగా రవాణా చేసే వారిని నిలువరించి తనిఖీలు చేయడం… చివరకు వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం. ఏడాది కాలంగా పరిపాటిగా మారిన ఈ తతంగం గురించి పోలీసుల దృష్టికి రావడంతో రంగంలోకి దిగారు. సరిహద్దు ప్రాంతంలో పోలీసులను మించిన గస్తీ నిర్వహిస్తున్నదెవరంటే…? జర్నలిస్టు ముసుగు వేసుకున్న నకిలీలు. వీరి వసూళ్ల పర్వానికి కట్టడి చేసే వారు లేరన్న ధీమాతో వ్యవహరిస్తున్న తీరు తెలిసి పోలీసు అధికారులే వారిని వెటాడి పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసులు బుధవారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం… చొప్పదండి జనార్థన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటీ సంతోష్, జీలపల్లి పోచం, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ఎడ్ల రవాణా, కలప రవాణా, బియ్యం రవాణా చేస్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ విలేకరుల ముసుగులో కారుకు ప్రెస్ అనే స్టిక్కర్ వేసుకుని తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఐడీ కార్డులు పెట్టుకుని మరీ రిపోర్టర్లుగా చెలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నందున వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే వీరిలో కొంతమందిపై ఇతర నేరాలకు సంబంధించిన కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. ఈ వివరాలను కూడా వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్లు వీరిపై షీట్లను ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్టు పెట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితుల నుండి కారు, నగదు, ఐడీ కార్డులను రికవరీ చేశామని తెలిపారు.

రాత్రి ఎందుకు..?

చట్టబద్దంగా రవాణా చేసుకునే వారు రాత్రి వేళల్లో పశువులు, బియ్యంతో పాటు ఇతరాత్ర వస్తువులను ఎందుకు తరలిస్తున్నారని ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రశ్రించారు. పగటి పూట రవాణా చేసుకున్నట్టయితే ఇలాంటి బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై కూడా గతంలో కేసు నమోదు చేశామని అక్రమ రవాణా చేస్తున్న వారిపై కూడా నిఘా కట్టుదిట్టం చేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. నకిలీ విలేకరులను అరెస్ట్ చేసిన క్రమంలో చాలా మంది బాధితులు తమను బ్లాక్ మెయిల్ చేశారని చెప్తున్నారని, ఇంకా ఎవరైనా వీరి బెదిరింపులకు భయపడి డబ్బులు ఇచ్చినట్టయితే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక ముందు కూడా ఇలాంటి వారి నుండి ఇబ్బందులు ఎదురైతే తమకు కానీ, ప్రెస్ క్లబ్ బాధ్యులకు కానీ ఫిర్యాదు చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

You cannot copy content of this page