కథ ముగిసిందా? కస్టడీ తీసుకుంటారా?

నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ను శనివారం సిబిఐ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు అతన్ని జైలుకు తరలించాలని ఆదేశించింది. అయితే శ్రీనివాస్ పలు రాష్ట్రాల్లో తిరుగుతూ జాతీయ దర్యాప్తు సంస్థల్లో నమోదయిన కేసులను మూయిస్తానని తాను కూడా జాతీయ దర్యాప్తు సంస్థల్లో పని చేస్తున్నానని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసన్ అరెస్టు చేసిన అధికారులు అతని మొబైల్ లాప్ ట్యాప్ ల నుండి సేకరించిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఇందులో తెలంగాణకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, అతని బంధువు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్లను సిబిఐ విచారించింది. ఆ తర్వాత శ్రీనివాసులు కోర్టులో హాజరు పరచడంతో అతనికి జ్యూడిషల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కస్టడీకి తీసుకుంటారా?

అయితే సిబిఐ అధికారులు నకిలీ పోలీసు ఆఫీసర్ శ్రీనివాస్ నుండి మరిన్ని వివరాలు రాబడతారా లేక కేసును ఇంతటితో వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయన్ను కస్టడీకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిలు నకిలీ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాస్ కు ఎలాంటి ముడుపులు అప్పగించలేదని సిబిఐ అధికారుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ తమను ఓ కార్యక్రమంలో పరిచయం చేసుకున్నారని అంతకుమించి అతనితో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని మంత్రి గంగుల ఎంపీ రవిలు ప్రకటించారు. అయితే శ్రీనివాస్ వివిధ రాష్ట్రాల్లో తిరిగి జాతీయ దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులను క్లోజ్ చేయిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని సిబీఐ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనివాసులు కస్టడీకి తీసుకొని మిగతా వివరాలపై ఆరా తీస్తారా లేదా అన్నది అంత చిక్కకుండా పోయింది. ఇప్పటి వరకైతే సిబిఐ అధికారులు శ్రీనివాసును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు ఇక ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఒకవేళ సిబిఐ అధికారులు శ్రీనివాసును తమకు అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ కోర్టులో వేస్తే మాత్రం మరిన్ని కోణాల్లో ఆరా తీసే అవకాశాలు లేకపోలేదు. ఈ నకిలీ పోలీసు అధికారి ఎవరి ద్వారా ప్రముఖులను కలిశాడు, వారికి ఎలాంటి మాయమాటలు చెప్పాడు? ఈ వ్యవహారాల్లో ఆయన వసూలు చేసింది ఎంత తదితర విషయాలన్నింటిని సేకరించే అవకాశం లేక పోలేదు.

You cannot copy content of this page