అంతుచిక్కని అంజిరెడ్డి తీరు…
బీజేపీ శ్రేణుల్లో చర్చ
దిశ దశ, కరీంనగర్ం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అభ్యర్థుల తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఓటర్లతో మమేకం అయ్యేందుకు పార్టీ శ్రేణులను కలుపుకపోయే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతల దృష్టిలో ఉంటే సరిపోతుందన్న భావనతో ఉండడం కూడా వారికి నష్టాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచార పర్వంలో వ్యవహరిస్తున్న తీరు పార్టీ వర్గాలను విస్మయం వ్యక్తం చేస్తోంది.
ఫ్యామిలీ ప్యాక్…
ప్రధానంగా అంజిరెడ్డికి సంబంధించిన వ్యవహరాలను చక్కబెట్టేందుకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయారిటీ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. అంజిరెడ్డి వారసులతో పాటు బంధువులతో టచ్ లోకి వెళ్లాలన్న సంకేతాలు ఇస్తుండడంతో పార్టీ శ్రేణులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రెండు రోజుల క్రితం కరీంనగర్ లో భారీ ర్యాలీ తీసిన అంజిరెడ్డి, వాకర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రణాళిక కూడా కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన వారే తయారు చేసినట్టుగా తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాలు, ప్రత్యక్ష్య ఎన్నికల సమీకరణాల విషయంలో అంతగా పట్టులేని అంజిరెడ్డి జిల్లాల వారిగా ముఖ్య భూమిక పోషిస్తున్న పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించినట్టయితే బావుండేది. కానీ అలాంటి చొరవ తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపించడం లేదు. దీనివల్ల పార్టీ అభ్యర్థి అన్న విషయం ప్రజలకు చేరవేసే బాధ్యతలను తమ భుజాలపై వేసుకునే కార్యకర్తలు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించే అవకాశం ఉంది. దీనివల్ల పటిష్టమైన ప్రచారం జరిగే అవకాశం ఉండదని, ఓటర్లను అనుకూలంగా మల్చుకోవడంలో విఫలం అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంజిరెడ్డి తనయులు, తనయల ప్రమేయం ఎక్కువ కావడం కూడా పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.
ఏజెన్సీలపైనే…
అయితే అంజిరెడ్డి వ్యూహాలు కూడా అత్యంత విచిత్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలతో టచ్ లో ఉంటూనే ఆయన ప్రత్యామ్నాయ ప్రచారానికి అవసరమైన స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రజాభిప్రాయ సేకరణకు మాత్రమే ఉపయోగపడిన సర్వే ఏజెన్సీల ద్వారా మరో వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏజెన్సీల ద్వారా మండలానికో ఇంఛార్జిని నియమించి, ఓటర్లను ప్రత్యక్ష్యంగా కలుసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్టు సమాచారం. పోలింగ్ ముగిసే నాటికల్లా పట్టభద్రులైన ఓటర్లను కలిసి పార్టీ మేనిఫేస్టో, అభ్యర్థి విజన్ గురించి సమగ్రంగా వివరించేందుకు కార్యాచరణ తయారైందని సమాచారం. పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయన మాత్రం సపరేట్ మానిటరింగ్ వ్యవస్థను రంగంలోకి దింపుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. దీంతో పార్టీ శ్రేణులతో సంబంధం లేకుండానే ప్రచారాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నట్టుగా అర్థమవుతోందన్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ నేతల దృష్టిలో పాజిటివ్ థింకింగ్ ఉండేలా వ్యవహరిస్తూనే సొంత సైన్యం ద్వారా క్యాంపెయిన్ చేయించేందుకు సమాయత్తం అవుతున్న తీరు పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. దీనివల్ల పార్టీ శ్రేణులు దూరం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, మొక్కుబడి ప్రచారంతో సరిపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలను ఆయనకు వెల్లడించినప్పటికీ ఆయన మాత్రం సొంత ప్రణాళికలకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.