దిశ దశ, ఏపీ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత వైవిద్యంగా సాగుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారే వేర్వేరు పార్టీలను నడిపిస్తున్న చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికే దక్కింది. రక్త సంబంధం ఉన్న వారే వ్యూహ ప్రతి వ్యూహాల్లో తల మునకలయ్యే పరిస్థితి ఇక్కడే సాక్షాత్కరిస్తోంది.
నందమూరి వారసులు…
ఏపీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసింది మాత్రం నందమూరి ఎన్టీ రామారావు కుటుంబమే. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పూర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ చరిత్ర క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వారు మాత్రం తలొదిక్కు అన్నట్టుగా మారిపోయారు. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న టీడీపీలో ఎన్టీఆర్ వారసులు మాత్రం కీలక భూమిక పోషించడం లేదు. తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీలో తనయుడు బాలకృష్ణ సెకండ్ క్యాడర్ లీడర్ గానే ఉండాల్సి వచ్చింది. గతంలో హరికృష్ణ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే ఇప్పుడు మాత్రం బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. ఇక పోతే ఎన్టీఆర్ కూతుర్లలో చూసుకున్నట్టయితే భువనేశ్వరి భర్త అడుగుజాడల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో నేరుగా ప్రజల్లోకి భువనేశ్వరి వచ్చారు. అయితే ఎన్టీఆర్ హయాంలో తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసిన మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు నామా మాత్రంగానే మిగిలిపోగా, ఆయన సతీమణి పురందేశ్వరీ ప్రస్తుతం బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే హరికృష్ణ తనయుడు సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకో మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉంచుతున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఓ సారి జూనియర్ ఎన్టీ రామారావుచే ప్రచారం చేసినప్పటికీ ఆ తరువాత ఆయన సేవలను అందుకునేందుకు టీడీపీ ముఖ్య నాయకత్వం ముందుకు రావడం లేదు. తాజాగా ఎన్టీఆర్ వర్థంతి రోజున ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య సూచించిన విషయం కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో రానున్న ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఎటువైపో అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
వైఎస్ కుటుంబం…
ఇకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగ రాసిన ఘనత మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. పార్టీలోనే కొనసాగుతూ వ్యతిరేకవర్గంగా ఎదిగిన వైఎస్ ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు గెలిపించారు. ఆయితే 2009లో వైఎస్ మరణానంతరం ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి, కూతురు షర్మిలలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత అధిష్టానం ఇచ్చిన షాక్ తో వైసీపీని ఏర్పాటు చేశారు జగన్. 2019 ఎన్నికల తరువాత కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత అన్నా చెల్లెల్లె మధ్య విబేధాలు పొడసూపాయి. దీంతో తెలంగాణ వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల తెలంగాణలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసినప్పటికీ సక్సెక్ కాలేకపోయారు. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా అప్పగించడంతో రానున్న ఎన్నికల్లో షర్మిల ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాల్సి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అన్నా, చెల్లెల్ల మధ్య మాటల యుద్దం చోటు చేసుకోనున్నాయి. అటు నందమూరి, ఇటు వైఎస్ కుటుంబాల సభ్యులు ప్రత్యర్థి పార్టీల తరుపున పోటాపోటి ప్రచారాలు చేసే అరుదైన దృశ్యం ఏపీ ఎన్నికల్లో సాక్షాత్కరించనుంది.