బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సతీశ్ కౌశిక్.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. ఈ ప్రపంచంలో మరణం అనేది అంతిమమని తనకు తెలుసు.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ సతీశ్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదని అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 45ఏళ్ల తమ స్నేహం నేటితో ముగిసిందని వ్యాఖ్యానించారు. సతీశ్ కౌశిక్ హఠాన్మరణంపై నటి కంగనా రనౌత్‌తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.
సతీశ్ కౌశిక్ 1956, ఏప్రిల్ 13న హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జన్మించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆపై బాలీవుడ్‌లో సతీష్ కౌశిక్‌కు బ్రేక్ దక్కింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు. కల్ట్ క్లాసిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ఆ సినిమా సంభాషణలు చాలా కాలం పాటు హిందీ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఆపై యాక్టర్‌గా కొనసాగారు. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శక, నిర్మాతగానూ ఆయన బాలీవుడ్‌లో రాణించారు.
1983లో వచ్చిన ‘మాసూమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలకు పనిచేశారు. 1990లో రామ్ లఖన్, 1997లో సాజన్ చలే ససురాల్ సినిమాలకుగాను ఫిల్మ్‌ఫేర్ (ఉత్తమ హాస్యనటుడు) అవార్డు అందుకున్నారు. శ్రీదేవి లీడ్ రోల్‌లో నటించిన రూప్ కీ రాణి.. చోరో కా రాజా, టబు లీడ్ రోల్‌లో నటించిన ‘ప్రేమ్’ చిత్రాలకు సతీశ్ కౌశిక్ దర్శకుడు. కానీ, ఈ రెండు చిత్రాలు ఆడలేదు. అయితే హమ్ ఆప్‌కే దిల్ మే రహ్‌తే హై, తేరే సంగ్ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించాయి.
మిస్టర్ ఇండియాలో ‘క్యాలెండర్’, దీవానా మస్తానాలో పప్పు పేజర్ పాత్రలు ఐకానిక్ రోల్స్‌గా హిందీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. తేరే నామ్, వాదా వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 2007లో అనుపమ్ ఖేర్‌తో కలిసి కరోల్ బాగ్ ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీని ప్రారంభించారు.