చింత చెట్టుకు కళ్లు పారుతోందట..!

భూమికి సుమారు రెండు అడుగుల ఎత్తు నుండి తెల్లటి ద్రవం ఒకటి కారడం కనిపించింది వారికి. తమ ఇంటి ఆవరణలోని చెట్టు మొదట్లో తెల్లని ద్రవం కారడం ఏంటా అని పరికించి చూశారు. చెట్టు నుండి నిరంతరంగా వస్తున్న ఆ ద్రవాన్ని గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో తండోప తండాలుగా జనం ఈ వింతను గమనించడం ఆరంభించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ఓ చింతచెట్టు నుండి కళ్ళు పారుతున్న విషయాన్ని ఇంటి యజమానులు గమనించారు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో చింత చెట్టుకు కళ్లు పారుతోందన్న విషయాన్ని తెలుసుకుని నేరుగా చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇప్పటి ఈత, తాటి, వేప కళ్లు గురించి విన్నాం కానీ చింత చెట్టు నుండి కూడా కళ్లు రావడం ఏంటా అని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

ఆయన చెప్పినట్టే…

రానున్న కాలంలో జరగనున్న విషయాలపై శ్రీ మద్విరాట్ పోతులూరి వీర

బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన పలుకులు నిజమయ్యాయమని స్థానికులు అంటున్నారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారం చింత చెట్టుకు కల్లుపారుతుందని చెప్పారని ఇప్పుడా విషయం రుజువు అయిందంటూ పాలకుర్తి వాసులు అంటున్నారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్ని కూడా నిజం అయ్యాయని ఇప్పుడీ విషయం కూడా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఉందని అంగడి బజార్ ప్రాంతానికి చెందిన వృద్దులు అంటున్నారు. ఈ వింతను చూడడానికి పాలకుర్తితో పాటు సమీప గ్రామాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి చూడడం ఆరంభించారు. అయితే ఇందులో వింత ఏమీ లేదని వేప, చింత, మర్రి వంటి రకాల చెట్లకు తెగులు సోకినప్పుడు ఇలాంటి ద్రవ పదార్థం కారుతూ ఉంటుందని అంటున్నారు. చెట్టు తెగిన ప్రాంతం నుండి లోపలకు బ్యాక్టీరియా చేరినప్పుడు కొన్ని చెట్ల నుండి నురగలా ద్రవ పదార్థం రావడం సహజమని, ఆల్కహాలిక్ నేచర్ కలిగి ఉంటుందని అంటున్నారు మరి కొందరు. మరో వైపున ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తాము పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి పండుగ చేసుకుంటున్న క్రమంలో తమ ఇంటి ఆవరణలోని చింత చెట్టు నుండి కళ్లు రావడం అమ్మదయేనంటూ ఇంటి యజమానులు అంటున్నారు. పాలకుర్తిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. నెట్టింట ఇందుకు సంబందించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చారు.

పాలకుర్తిలో చింతచెట్టుకు కళ్లు పారుతున్న విషయాన్ని స్థానికులు ఏమంటున్నారో ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీరూ వినండి
https://youtu.be/dENC32Ohuf4

You cannot copy content of this page