దిశ దశ, జగిత్యాల:
అరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సహనం కోల్పోయిన ఓ రైతు వినూత్న నిరసన తెలిపారు. తాము పండించిన పంటను అమ్ముకునేందుకు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తన అసహనాన్ని ఏకంగా మంత్రి క్యాంప్ ఆఫీసు ముందే ప్రదర్శించి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రత్యక్ష్యంగా చూపించాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ కు చెందిన సట్టంశెట్టి రాజన్న శనివారం ఉదయం ధర్మపురి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు ట్రాక్టర్ లో ధాన్యం తీసుకొచ్చి పోశాడు. భారీ వర్షాలు పడుతున్న సమయంలో మంత్రి స్వయంగా కొనుగోలు కేంద్రాలను తడుచుకుంటూ సందర్శించి తమకు భరోసా కల్పించారని రాజన్న వివరించారు. అప్పుడు అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేస్తామని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి ఈశ్వర్ తమకు హామీ ఇచ్చారన్నాడు. అయితే నెల రోజులు దాటి తాను ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రంలో ఉన్నా సేకరించే వారే లేకుండా పోయారన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటున్నారని, నిభందనల ప్రకారం ఉండాల్సినంత తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ప్రాక్టికల్ గా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలిపేందుకే తాను క్యాంపు ఆఫీసు ముందు ధాన్యం పోశానని రాజన్న వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ ను స్టేషన్ కు తరలించారు.
https://www.youtube.com/watch?v=Jxoew2XJjI8