రెవెన్యూ లీలలు…

నిన్న రైతు ఆత్మహత్య

నేడు పేపర్లు కాల్చే యత్నం

దిశ దశ, కరీంనగర్:

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమా లేక రైతుల పాలిట శాపమో కానీ పట్టా భూముల సమస్యలు మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడడమో లేక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమో చేస్తూనే ఉన్నారు. ఓ వైపున రెవెన్యూ అధికారులపై దాడులు జరుగుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకునే వారే లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుసగా రెండు రోజుల పాటు జరిగిన ఈ ఘటనలను పరిశీలిస్తే రైతుల్లో నెలకొన్న నైరాశ్యం ఇట్టే అర్థమవుతుంది.

తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మల్లేషం

ఖాజీపూర్ రైతు…

గురువారం కొత్తపల్లి మండలం ఖాజీపూర్ అయిలోనిపల్లికి చెందిన అనుగుల మల్లేష్ అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే పురుగుల మందు తాగి సూసైడ్ అటెమ్ట్ చేసుకున్నారు. మల్లేషంను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుండి అపోలో ఆసుపత్రికి తరలించగా శుక్రవారం మల్లేషం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన మల్లేశం చివరకు అదే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. అయితే మల్లేషం తన వద్ద ఓ లేఖ కూడా రాసిపెట్టుకుని తహసీల్ ఆఫీసుకు చేరుకున్నాడంటే ఆయన ఎంతటి వేదనకు గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. తను తనువు చాలిస్తే అయినా భూమి సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని, తన కుటుంబ సభ్యులకు ఇలాగైనా భూమి వస్తుందన్న ఆశతో మల్లేశం చనిపోయి ఉంటాడని స్థానికులు అంటున్నారు.

మరో రైతు దీనస్థితి…

ఇక పోతే మరో రైతు కూడా జగిత్యాలలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పట్టణంలో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లు చేరుకున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన దుబ్బ నారాయణ అనే రైతు కొత్త పాసు బుక్కు ఇవ్వడం లేదని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమికి సంబంధించిన పాత పాసు బుక్కు ఉందని కొత్త పాస్ బుక్కు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నానని దళిత రైతు వివరించాడు. తన కొడుకు చనిపోయాడని తనకున్న 10 గుంటలు భూమిలోనే సాగు చేసుకుంటున్నానని అధికారులకు వివరించి కొత్త పాస్ బుక్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన భూమికి సంబంధించిన పేపర్లను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ముందే కిందపడేసి నిప్పంటిస్తానని చెప్పడంతో పోలీసులు, స్థానికులు నారాయణను వారించి పక్కకు తీసుకెళ్లారు. చట్ట సభల ప్రతినిధుల ముందే తన ఆవేదన వెలిబుచ్చితే అయినా తనకు న్యాయం జరుగుతుందని ఆశించిన నారాయణ నిరసన వెలిబుచ్చినట్టు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు సన్న, చిన్నాకారు రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమకు ఉన్న కొద్దిపాటి భూమి కూడా లిటిగేషన్ చిక్కుల్లో చిక్కుకోవడంతో తట్టుకోలేకపోతున్న రైతన్నలు అక్కసు వెల్లగక్కుతున్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

జగిత్యాలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ముందు నిరసన తెలిపిన నారాయణ

You cannot copy content of this page