దిశ దశ, పలిమెల:
అడవి బిడ్డలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రాంతాల ప్రాంతమంతా బాధిత రైతాంగం నినాదాలతో దద్దరిల్లిపోతోంది.
పలిమెల మండలం…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల శివార్లలోని వందలాది ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు స్థానిక రైతులు. అయితే అప్పటి భూస్వాములు పీపుల్స్ వార్ నక్సల్ కారణంగా ఈ ప్రాంతాన్ని వదిలేసి వెల్లిపోయారు. వారి భూములను ఇక్కడి నిరుపేదలకు అప్పగించి వెల్లిపోవడంతో అప్పటి నుండి ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రికార్డుల్లో మాత్రం ఈ భూములకు పట్టాదారులుగా పెత్తందార్లు మారుతూ వస్తున్నారు. తాజాగా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ భూములను విక్రయించడం… ఈ విషయం బయటకు పొక్కడంతో పలిమెల, బొడాయి, పంకెన, అప్పాజిపేటకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకే రోజు…
దక్కన్ సిమెంట్స్ కంపెనీ కోసం విక్రయించిన ఈ భూమికి సంబంధించిన పట్టాదారుల పేర్లను మార్చేందుకు అధికారులు చకాచక పావులు కదిపారని ఆరోపిస్తున్నారు. రోజు వందకు ఎకరాలకు పైగా ఒకే భూమిని నమోదు చేయడం. సాధారణ రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫైళ్లు ముందుకు కదలవన్న ఆరోపణలు. అలాంటిది ఓ మారుమూల మండలంలో మాత్రం ఒక్కరోజు 102 ఎకరాల భూమికి యాజమాన్య హక్కులు మార్చేశారంటే దీని వెనక అసలేం జరిగిందో అర్థం చేసుకోవచ్చని రైతులు అంటున్నారు.
మూడు తారలుగా …
మూడు తారలుగా ఇదే భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు పలిమెల మండలానికి చెందిన రైతులు. దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఈ భూములు తమవేనన్న ధీమాతో జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి ఉప్పెన వచ్చినట్టుగా సిమెంట్ కంపెనీ పేరుతో తమ ఆధీనంలో ఉన్న భూములు స్వాధీనం అయ్యాయని తెలుకున్న రైతులు లబోదిబో మంటున్నారు. తాతాల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు పెద్దలు కుట్రలు పన్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములను నమ్ముకుని సాగిస్తున్న విషయం తెలిసి కూడా అధికారులు కంపెనీ పేరుతో పేరు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ చేతిలో ఉన్న భూములను తమ వారసులకు అప్పగించాలని కలలు కంటున్నామని, ఇప్పుడు ఆ భూములు వేరే వారికి చెందిన అధికారులు రికార్డుల్లో నమోదు చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు.
ఎలా…?
ఈ భూములకు సంబంధించిన అసలు యజమాని దశాబ్దాల క్రితమే హైదరాబాద్ నగరానికి వెల్లిపోయి అక్కడే చనిపోయారని వారి వారసుల పేరుతో భూములు బదలాయించాలన్న దరఖాస్తులు కూడా ఏనాడు అధికారులకు అందలేదని ఆయా గ్రామాల రైతులు వివరించారు. చట్ట ప్రకారం ఆ భూములకు పట్టాదారులుగా తమ పేర్లను చేర్చాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగలేదని వాపోయారు. రైతుల పేరుతో కొన్ని భూములు బదలాయించినప్పటికీ… 1986లో వచ్చిన వరదల్లో పట్టా పేపర్లు కొట్టుకుపోయాయని, ఆఫీసు రికార్డులపై ఆధారపడదామని భావించినప్పటికీ మహదేవపూర్ తహసీల్దార్ ఆఫీసు లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సాకుతో తమకు తీరని అన్యాయం చేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పట్టదారుల వారసులుగా క్రియేట్ చేసి రికార్డులు మార్చేశారని, నిబంధనల ప్రకారం మాత్రం నడుచుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అనామకులను చూపించి డెత్ సర్టిఫికెట్లు, వారసుల ధృవీకరణ పత్రాలు లేకుండానే అధికారులు తమకు నచ్చిన విధంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. మోఖాలో ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా చకాచకా పట్టదారుల పేర్లను మార్చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అధికారులు రికార్డుల్లో పట్టాదారుల పేర్లను మారుస్తూ వారికి వత్తాసు పలకడం వల్లే నేడు సిమెంట్ కంపెనీ చేతుల్లోకి భూములు చేరాయని ఆరోపిస్తున్నారు. అసలు పట్టాదారు వారసుల నుండి భూములు మరోకరి పేరుతో మార్చబడినప్పుడు అధికారులు ఏ సర్టిఫికెట్లను తీసుకున్నారో పరిశీలించి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీధర్ బాబు వల్లే ఇదంతా: పుట్ట మధు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండదండలతోనే ఈ వ్యవహారం జరిగింది, ఆయన తమ్ముని కోసమే భూములను బదలాయించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గుర్తింపు. మూడు తరాలకు చెందిన దళిత, గిరిజన రైతులు ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తే వారిని నడిరోడ్డుపై వేసే విధంగా చేశారన్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని మధు ప్రశ్నించారు. అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి రైతుల పేరుతో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో రైతాంగానికి అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2008లో కమాలోద్దీన్ అనే వ్యక్తి ఈ భూములను నమోదు చేసినట్లుగా రికార్డులు చెప్తున్నాయని, కమాలోద్దీన్ తోనే భూముల విషయంలో కమాల్ పుట్ట మధు స్థలాలు. అసలు పట్టాదారులతో సంబంధం లేని వ్యక్తులను రంగంలోకి దింపి పలిమెల వారు, దళిత గిరిజన రైతులకు తీరని నష్టం వాటిల్లేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఒప్పందాలను రద్దు చేసి తరతరాలుగా భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులను పట్టాదారులుగా మార్చాలన్నారు. స్థానిక రైతుల పక్షాన కోర్టులను కూడా ఆశ్రయించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మూడు తరాలుగా…
మూడు తరాలుగా ఈ భూముల్లోనే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పంకెన గ్రామానికి చెందిన పాగె లక్ష్మీ వివరించారు. సాగు నీటి వనరులు అంతగా లేని కాలంలో జొన్నలు పండించామని, ఆ తరువాత వాణిజ్య పంటలు వేసుకుంటున్నామని వివరించారు. తాతల నుండి సంక్రమించిన ఆస్తిగా బావిస్తున్న తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఊరుకునేది లేదు…
పలిమెల భూముల్లో సిమెంట్ కంపెనీ జోక్యం చేసుకున్నట్టయితే ఊరుకునేది లేదని బొడాయిగూడెం గ్రామానికి చెందిన బాపు అన్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ జీవితాలతో చెలగాటమాడే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూములను తమ పేరు మార్చుకోవాలని, తమ బిడ్డలకు కూడా ఇవే జీవనాధారమన్నారు.
సబ్ కలెక్టర్ పర్యవేక్షణ …
పలిమెల కంపెనీ భూముల వ్యవహారంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పలిమెల మండల కేంద్రానికి చేరుకుని కబ్జాలో ఉన్న రైతుల వివరాలను సేకరించారు.
విచారణ ప్రారంభం…
పలిమెల మండలంలో జరిగిన 102 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని మహ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు ప్రకటించారు. ఆ భూముల విషయంలో అధికారులు చేసిన తప్పుల గురించి బాధిత రైతులు తన దృష్టికి తీసుకరాగా మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు విచారణ చేశారని రాజబాబు తెలిపారు.