దిశ దశ, భూపాలపల్లి:
మహారాష్ట్ర రైతులు పట్టు వీడకుండా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తమ పాలిట శాపంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించందని ఆరోపిస్తూ విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు లేఖ రాశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు కోరుతున్నారు.
మేడిగడ్డ వల్ల…
ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం వల్ల గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని సుమారు 10 గ్రామాలకు చెందిన భూమిని సేకరించారని, నిర్మాణానికి ముందే సర్వే చేసిన అదికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని బాధిత రైతులు వాపోతున్నారు. సాధారణంగా ఏదైనీ రిజర్వాయర్ నిర్మించినట్టయితే ఫుల్ రిజర్వాయర్ లెవల్ లో నీరు ఉన్నప్పుటు ఎంత మేర భూమి ముంపునకు గురవుతుంది, అదనంగా బఫర్ జోన్ ఎంత మేర సేకరించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వేలు చేయాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే మేడిగడ్డ విషయంలో కనీస సూత్రాలను కూడా పాటించకుండా అధికారులు తక్కువ భూమి ముంపునకు గురవుతుందని తప్పుడు నివేదికలు తయారు చేసి తమ జీవితాలతో ఆడుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట అధికారులు మేడిగడ్డ కోసం తమ గ్రామాలకు చెందిన భూమి 373.80 హెక్టార్లు మాత్రమే అవసరం పడుతుందని అంచనా వేశారని అయితే బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తరువాత అదనంగా మరో 500 హెక్టార్ల వరకు భూమి ముంపునకు గురవుతోందని రైతులు చెప్తున్నారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మొదట గుర్తించిన 373.80 హెక్టార్లలో కేవలం 234.91 హెక్టార్లకు మాత్రమే పరిహారం చెల్లించిందని, 138.91 హెక్టార్ల భూమికి మాత్రం డబ్బులు చెల్లించలేదని దీంతో తాము ఏళ్ల తరబడి ఆందోళనలు కొనసాగిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సొంత నిధులను కెటాయించిందన్నారు. అయితే అదనంగా ముంపునకు గురవుతున్న భూమిపై తమ ఆందోళనలో సర్వే చేయించినప్పటికీ నోటిఫై చేయలేదన్నారు. దీంతో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము ఉపాధి కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా న్యాయం చేసేందుకు చొరవ చూపాలని ఘోష్ కమిషన్ తమ ప్రాంతానికి ప్రత్యేక బృందాలు పంపించి వాస్తవాలు గమనించి ఆదుకోవాలని సిరొంచ రైతులు వినతి చేశారు.
1/70 చట్టం...
గడ్చిరోలి జిల్లా అంతా కూడా ఆదివాసి జిల్లాగా గుర్తించబడిందని, ఇక్కడ 1/70 అమల్లో ఉన్నప్పటికీ ఈ నిబంధనలకు అనుగుణంగా కూడా వ్యవహరించకుండా తమ భూములు సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రైబల్ యాక్ట్ కు అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా 2013 భూ సేకరణ చట్టాన్ని కూడా అమలు చేయలేదని దీంతో వందలాది కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్మాణాల విషయంలోనే కాకుండా భూ సేకరణ జరిపిన తీరుపై కూడా విచారించినట్టయితే రైతులకు జరిగిన అన్యాయం వెలుగులోకి వస్తుందని అంటున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని మహదేవపూర్ నుండి జస్టిస్ ఘోష్ కమిషన్ తమ ఆవేదనను వివిరిస్తూ లేఖ రాసి పంపించామని సిరొంచ రైతులు తెలిపారు.