ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త కష్టాలు… వరిపంట అంతా ఓబి మట్టి పాలు…

దిశ దశ, మంథని:

నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినట్టుగానే అక్కడ మట్టి మేటలు వేస్తోంది. వర్షాకాలం రాగానే ఇతర ప్రాంత రైతులు సంబరపడిపోతే అక్కడి రైతులు మాత్రం భయంభయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి తయారైంది. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని రైతాంగం సరికొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాలతో పాటు సమీప గ్రామాల రైతులు తమ పంటల్లోకి వరద నీటితో పాటు ఓపెన్ కాస్ట్ బావుల నుండి మట్టి కొట్టుక రాకుండా చూడాలని వేడుకుంటున్నారు. సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఓసీపీల వల్ల తమ పొలాలు మట్టిపాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి వరినాట్లు వేసుకుంటే వర్షపు నీటితో పాటు ఓబీ మట్టి తమ పొలాల్లోకి వచ్చి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాట్లు వేసిన వరి అంతా కూడా ఓపెన్ కాస్ట్ మట్టిపాలు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కన్నాల గ్రామంలోనే సుమారు 50 ఎకరాల వరకు పంట పొలాలు ఓబి మట్టితో నిండిపోయాయని తెలిపారు.

సింగరేణి నిర్లక్ష్యం…

భూ సేకరణ జరిపిన సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ మైన్స్ ద్వారా బొగ్గు నిల్వలను వెలికి తీసుకుంటోంది. అయితే ఈ బావుల్లో మట్టిని వేరు చేసి బావికి బౌండరీలా కట్టాల వేయిస్తుంటుంది సింగరేణి సంస్థ. గుట్టలుగా పేరుకున్న ఓపెన్ కాస్ట్ మట్టి వర్షాకాలం రాగానే సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి వరద నీటి ప్రవహంలో కొట్టుకుంటూ వచ్చి చేరుతోంది.దీంతో రైతులు వేసిన వరినాట్లు మట్టికింద కూరుకపోతున్నాయి. దీంతో వరినాట్ల కోసం వెచ్చించిన ఖర్చులతో పాటు దిగుబడిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని రైతులు చెప్తున్నారు. ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు సేకరణలో భాగంగా బయటకు వస్తున్న మట్టిని బావి చుట్టూ గుట్టలుగా పేరుస్తున్న అధికారులు వర్షాకాలంలో కిందకు జారకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. మట్టికిందకు జారకుండా ఉండేందుకు కంచెలు కానీ ఇతరాత్ర జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే తమ పొలాలు బావుంటాయని వారంటున్నారు. సింగరేణి అధికారులకు గతంలో గోడు వెల్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయిందని కన్నాల రైతు గుడిసె గట్టయ్య ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ. 40 వేల వరకు వెచ్చించి వరి సాగు చేస్తుంటే ఓపెన్ కాస్ట్ మట్టి పొలాలను ముంచెత్తి తీరని నష్టానికి గురి చేస్తోందన్నారు. తమకు పరిహారం ఇవ్వడంతో పాటు వరద నీటి ద్వారా ఓబి మట్టి దిగువ ప్రాంతానికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే సింగరేణి సంస్థకు చెందిన లారీలను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

You cannot copy content of this page