సీఎం కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణాలు కాదని, జాతి నిర్మాణం అని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లు కట్టడం కాదని, అందరికీ పార్మ్‌లు కావాలని చెప్పారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని తెలిపారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ది కాదని, రాష్ట్ర విద్యాయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళి సై సూచించారు.
రాజ్యాంగస్పూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరుతున్నట్లు చేస్తున్నానని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, రాజ్యాంగాన్ని కాపాడుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ ప్రజలంటే తనకు చాలా ఇష్టమని తమిళిసై స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్దిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం కేసీఆర్ టార్గెట్ గా తమిళిసై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. ‘కరోనా సమయంలో దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతుల, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ గవర్నర్ అడిగినందుకు ధన్యవాదాలు’ అని కవిత ట్విట్టర్ లో పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మండిపడ్డారు. ఎవరి బాధ్యత ఏంటో చెప్పినదే రాజ్యాంగం అని, స్వాతంత్ర్యం, రాజ్యాంగం ఏ ఒక్కరి సొత్తుకాదన్నారు.
దేశాన్ని పరిపాలించే వ్యక్తులు రాజ్యాంగ స్పూర్తితో పనిచేయాలని, రాజకీయ పార్టీలు విమర్శలకే పరిమితం కాకుండా ప్రజల అభివృద్దిని కూడా చూపించాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని, మైకులు అందగానే ఆరోపణలు చేయడం తగదన్నారు. కొందరి కళ్లలో సంతోషం కోసం పరిపాలన చేయవద్దని, అది రాజ్యంగానికే విరుద్దమన్నారు.