దిశ దశ, జాతీయం:
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కిదిద్దుకోవాలన్న యోచనలో నేతలు ఉంటారా లేక పొలిటికల్ పార్టీలూ ఇందుకు వత్తాసు పలుకుతాయో తెలియదు కానీ… రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ఒకే కుటుంబంలో వైవిద్యమైన నిర్ణయాలు ఉండడం… ఆ కుటుంబాలకు చెందిన వారు తమకు నచ్చిన పార్టీల వైపు అడుగులు వేయడం సహజం. కానీ ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రత్యర్థులుగా పోటీ చేయడం అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. అందులో తండ్రి, కూతుర్లు ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన సందర్భాలు కూడా చాలా అరుదే. ఇలాంటి భిన్నమైన పరిస్థితి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ అసెంబ్లీ నియోజకర్గంలో నెలకొంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కూటములుగా ఏర్పడి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అహేరీ ఎన్నికల బరిలో తండ్రి, కూతుర్లు తమకే మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
అహేరీ అసెంబ్లీ…
రాష్ట్రంలో విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో అహేరీ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. గడ్చిరోలి జిల్లాలోని కొన్ని తాలుకాల సమాహారంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వూగా ఉంది. ఇక్కడి నుండి దశాబ్దాలుగా కూడా ‘‘ఆత్రం’’ వారసులే బరిలో నిలుస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడంతో ‘‘ఆత్రం’’ అన్న ఇంటి పేరుగల వారే ప్రత్యర్థులు కావడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే తండ్రికి ప్రత్యర్థిగా నిలబడడం సరికొత్త సాంప్రాదాయానికి తెరలేచినట్టయింది.
కూటమిల పోరు…
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహాయుతి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ కూటమిలు తమ అభ్యర్థులను బరిలో నిలిపి అధికారం దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యాయి. అహేరీ నుండి పోటీ చేస్తున్న వారిలో ‘‘మహాయుతి’’ కూటమి తరుపున ధర్మరావు బాబా ఆత్రం, ‘‘మహా వికాస్ అఘాడి’’ తరుపున ఆయన కూతురు భాగ్య శ్రీ అల్ఘేకర్ బరిలో నిలవడం గమనార్హం. అలయెన్స్ పార్టీలు తండ్రి కూతుర్లను ఇక్కడ ప్రత్యర్థులుగా పోటీ చేయిస్తుండడం విశేషం. తండ్రి కూతుర్లు ప్రజా క్షేత్రంలో బరిలో నిలవడం స్థానికంగా సరికొ్త చర్చకు దారి తీసింది.
ముగ్గురూ ‘‘ఆత్రం’’ వారసులే
ఇక్కడి నుండి పోటీలో నిల్చున్న వారిలో ముగ్గురు అభ్యర్థులుల కూడా ‘‘ఆత్రం వార్’’ కావడం మరో విశేషం. అహేరీ నియోజకవర్గం నుండి అంబరీష్ రావు ఆత్రం రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించినప్పటికీ అలయెన్స్ లో ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి కెటాయించడంతో బీజేపీ నుండి టికెట్ ఆశించిన అంబరీష్ రావు ఆత్రంకు నిరాశే ఎదురయింది. దీంతో ఆయన రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల కలయికతో ఏర్పడిన కూటమిల తరుపున తండ్రి కూతర్లు ప్రధాన ప్రత్యర్థులు కావడం విచిత్రం కాగా రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబరీష్ రావు, ధర్మరావు బాబా, భాగ్యశ్రీ లు ఆత్రం ఇంటిపేరున్న వారసులే కావడం మరో విశేషం.