లోయర్ మానేరు డ్యాంలో విషాదం
దిశ దశ, మానకొండూరు:
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోటోలు దిగుతుండగా రిజర్వాయర్ నీటిలోకి జారిపడిన తన బిడ్డలను కాపాడబోయి తండ్రి మృత్యువాత పడ్డాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న బంగారు విజయ్ కరీంనగర్ లోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుస్నాబాద్ సమీపంలోని పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో తిమ్మాపూర్ మండలం అల్గునూరు సమీపంలోని లోయర్ మానేరు డ్యాం వద్దకు చేరుకున్నాడు. ఎల్ఎండీ కరకట్టపై నుండి ఫోటోలు దిగుతుండగా విజయ్ కూతురు సాయినిత్య డ్యాం కట్ట నుండి నీటిలోకి జారి పడడంతో ఆమెను కాపాడాలని విజయ్ కట్టపై నుండి నీటిలోకి దూకాడు. ఆ తరువాత కొడుకు విక్రాంత్ కూడా నీటిలోకి దూకాడు. ఎల్ఎండీలో చేపలు పడుతున్న జాలరి శంకర్ అరుచుకుంటూ ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులిద్దర్ని కాపాడాడు. అయితే విజయ్ నీటిలో మునిగిపోవడంతో అతన్ని క్షేమంగా బయటకు తీయలేకపోయారు. జాలరి శంకర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయినట్టయితే పిల్లలు కూడా తిరిగిరాని లోకాలకు చేరుకునే వారు.
మృతుడు విజయ్
=====
మిన్నంటిన రోధనలు…
ఎల్ఎండీలో సోమవారం జరిగిన ఈ ఘటనతో రిజర్వాయర్ ప్రాంతమంతా రోధనలతో నిండిపోయింది. తన కళ్లముందే పిల్లలిద్దరు నీటిలో పడిపోతుండగా కాపాడేందుకు వెల్లిన భర్త విజయ్ విగతజీవిగా మారిపోవడంతో ఆయన భార్య ప్రశాంతి కన్నీరు మున్నీరుగా విలపించి సొమ్మసిల్లి పడిపోయారు. విజయ్ మరణ వార్త తెలిసిన అతని బంధువులు, స్నేహితులు డ్యాం వద్దకు చేరుకోవడంతో ఎల్ఎండీ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిన్నారులను కాపాడిన జాలరి శంకర్
=========
ఎమ్మెల్యే కవ్వంపల్లి…
ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఎండీకి చేరుకున్నారు. విజయ్ కుటుంబ సభ్యులను పరమార్శించిన ఆయన చిన్నారులను ప్రాణాలతో కాపాడిన జాలరి శంకర్ ను అభినందించారు.