ఓ తండ్రి కష్టాలు…
అనారోగ్యానికి గురైన చిన్నారి చికిత్స పొందుతూ మృత్యువాత పడితే స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబూలెన్స్ అద్దెకు తీసుకెళ్లలేని నిరుపేద కుటుంబం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కన్న కూతురు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఓ తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. అన్నింటా అభివృద్దిలో దూసుకపోతున్నామని చెప్పుకుంటున్నా… చాలా ప్రాంతాలకు ఆచరణకు దూరంగా ఉన్నాయి. దీంతో పేదవాడి ఇబ్బందులు మాత్రం షరా మామూలే అన్నట్టుగా మారిపోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతూనే ఉంది. చివరకు శవాన్ని కూడా బైక్ పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి తయారైందా జిల్లాలో…
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసి గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సుక్కి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. కూతురు మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సుక్కి తండ్రి వెట్టిమల్ల వద్ద డబ్బు లేకపోవడంతో అంబూలెన్స్ అద్దెకు తీసుకోలేకపోయాడు. కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వెట్టిమల్ల దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. వేల రూపాయలు పెట్టి అంబూలెన్స్ అద్దెకు తీసుకోవాలంటే అప్పు చేయాల్సిన దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయన చివరకు తన కూతురి మృతదేహాన్ని బైక్ పై 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న స్వగ్రామానికి తీసుకువెళ్ళాడు. కన్న కూతురి మృతదేహాన్ని బైక్ పై తీసుకెల్తున్న తండ్రి గురించి తెలిసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది.