విధి వక్రీకరించింది… ఆర్థిక పరిస్థితి సహకరించనంది… తనువు చాలించిన ప్రజ్వల్…

దిశ దశ, వేములవాడ:

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఆ చిన్నారి తిరిగి బ్రతుకుతాడని కలలు కన్నా ఫలితం లేకుండా పోయింది.  విగత జీవిగా మారిన తమ బిడ్డను చూస్తూ ఆ తల్లిదండ్రులు విషాదంలో కూరుకపోయారు. బంగ్లాపై ఆడుకుంటూ కిందపడిపోయిన అతని తలలో ఇనుప రాడ్లు దిగాయి. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ బిడ్డను ప్రాణాలతో కాపాడుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లికి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రజ్వల్ ఇటీవల ఓ ఇంటిపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అతని తలలో రెండు ఇనుప రాడ్లు చొచ్చుకపోవడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతన్ని సికింద్రాబాద్ రెయిన్ బో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం చికిత్స పొందుతున్న ప్రజ్వల్ ను మృత్యువు తన ఒడిలో చేర్చుకుందని తెలిసి ఆయన తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుల వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజ్వల్ కు మెరుగైన చికిత్స అందించేందుకు చాలినంత డబ్బు కూడా వారివద్ద లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్ తన బిడ్డను రక్షించుకునేందుకు సాయం చేయాలని అభ్యర్థించారు. గ్రామస్థులు తమవంతుగా చేదోడు అందించినా చాలినంత డబ్బు చేతికి చేరకపోవడంతో ప్రజ్వల్ కు ఆపరేషన్ చేయలేకపోయారు. సకాలంలో వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజ్వల్ చివరి శ్వాస విడిచాడు. బిడ్డను కాపాడుకోవాలని ఆశించిన ఆ తల్లిదండ్రుల మృత్యువు విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణించాడన్న విషయం తెలిసిన వేములవాడ ప్రాంత వాసులు హతాశులయ్యారు. 

You cannot copy content of this page