141 మంది సీఐలకు పదోన్నతి

ఎన్నాళ్లకెన్నాళ్లకో…?

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏండ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతుల ఫైలుకు ఎట్టకేలకు మోక్షం కల్గింది. ఇందులో హైదరాబాద్, వరంగల్ జోన్లకు చెందిన 1996 బ్యాచ్ సీఐలు, హైదరాబాద్ సిటీ జోన్ కు చెందిన 1998 బ్యాచ్ సీఐలకు పదోన్నతి కల్పిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 141 మంది సీఐలకు డీఎస్సీలుగా పదోన్నతి కల్పిస్తున్నామని డీజీపీ అంజనీ కుమార్ ఈ మేరకు ట్విట్ చేశారు. దీంతో ఆయా బ్యాచ్ పోలీసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే వీరందరికి వ్యక్తిగతంగా ఆర్డర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమోషన్ కమిటీ 165 మంది అర్హులైన వారి జాబితా పంపించినప్పటికీ 141 మందికి మాత్రమే పదోన్నతి కల్పించారు. మిగతా వారికి కూడా త్వరలో ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

రెండున్నర దశాబ్దాలకు…

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసు విభాగంలో చేరిన 1996, 1998 బ్యాచులకు చెందిన ఎస్సైలకు రెండో ప్రమోషన్ రెండున్నర దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఇందులో వరంగల్ జోన్ పోలీసులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్తితుల్లో పోలీసు ఉద్యోగాల్లో చేరారనే చెప్పాలి. అప్పుడు పీపుల్స్ వార్ నక్సల్స్ చేతిలో ఎప్పుడు ఏవిధంగా మరణం అంచున చేరుతామోనన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విధుల్లో చేరేందుకు సాహసం ప్రదర్శించారనే చెప్పాలి. 1996 బ్యాచ్ కు చెందిన వారు 27 ఏళ్లకు రెండో ప్రమోషన్ అందుకుంటే, 1998 బ్యాచుకు చెందిన వారు 25 ఏళ్లకు పదోన్నతి పొందారు. ఏది ఏమైనా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు 1996, 1998 బ్యాచుల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఖుషీ కబర్ చెప్పింది.

You cannot copy content of this page