కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు…

దిశ దశ, హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించింది. రాష్ట్రంలో మూడు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఆచూతూచి వ్యవహరించిన ఏఐసీసీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో కొన్ని గంటల్లో నామినేషన్ల పర్వానికి తెరపడనుండగా బుధవారం రాత్రి  అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థిగా ఎండీ వలీఉల్లా సమీర్, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, ఖమ్మం అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో తెలంగాణాలోని 17 లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

ఉత్కంఠత…

కరీంనగర్, ఖమ్మం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఏఐసీసీ ఫైనల్ డెసిషన్ తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. కరీంనగర్ నుండి వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు టికెట్ ఆశించడంతో అథిష్టానం బుధవారం రాత్రి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోయింది. దీంతో అటు పార్టీ క్యాడర్ లో ఇటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారోనన్న చర్చ తీవ్రంగా సాగింది. వెలిచాల రాజేందర్ రావు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం, నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరపడంతో ఆయనకే అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందని భావించారంత. కానీ అనూహ్యంగా ప్రవీణ్ రెడ్డి తరుపున బుధవారం నామినేషన్ దాఖలు కావడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే రాత్రికల్లా అభ్యర్థిని ఫైనల్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠతకు తెరదించింది. ఖమ్మం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం రామసాయం రఘురామిరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. ఇక్కడి నుండి మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టీ సతీమణిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అంతేకాకుండా మరో మంత్రి తుమ్మల కూడా ప్రత్యామ్నాయంగా మరో నాయకుని పేరు ప్రతిపాదించారు. ఖమ్మం టికెట్ అంశం గురించి కర్ణాటక, ఢీల్లీలోని పార్టీ పెద్దలు తలలు పట్టుకోవల్సి వచ్చింది. అయితే మంగళవారం రఘురామిరెడ్డి తరపును నామినేషన్ దాఖలు కావడంతో కొత్త మలుపు తిరిగినట్టయింది. ఆయన పేరు మధ్యలో వినిపించినప్పటికీ రేసులో లేరన్న భావనతోనే అన్ని వర్గాలు ఉన్నాయి. కానీ చివరకు అధిష్టానం కూడా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక్కడి నుండి టికెట్ ఆశించిన వారితో పాటు వారి కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారంతా కూడా సైలెంట్ కావల్సి వచ్చింది.

You cannot copy content of this page