సర్కారు తరుపున రూ. 3, మంత్రి గంగుల తరుపున రూ. 2లక్షలు ప్రకటన
దిశ దశ, కరీంనగర్:
హోలీ పర్వదినాన కరీంనగర్ మానేరు తీరంలో జరిగిన ముగ్గురు మృత్యువాత పడడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ నుండి వచ్చిన వలస కూలీల కుటుంబాలకు అండగా ఉండాలని వారికి భరోసా కల్పించాలని సీఎం ఆదేశించారని మంత్రి గంగుల వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. పోలీసులు, ఇంజనీరింగ్ అధికారులు మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిలువరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
రూ. 3 లక్షల సాయం
ఒక్కో విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 3 లక్షలు సీఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు.
గంగుల వంతుగా…
మంత్రి గంగుల కమలాకర్ తన వంతుగా కూడా బాధిత కుటుంబాలకు బాసటనివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందిచనున్నట్టు ప్రకటించారు. మానేరు రివర్ ఫ్రంట్ గుంతలో పడి మరణించిన వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14)ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.