వెతికి పెట్టండి: బండి సంజయ్ కంప్లైంట్
దిశ దశ, కరీనంగర్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన మొబైల్ ఫోన్ పోయిందని దానిని వెతికి పెట్టివ్వాలని కోరుతూ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఫిర్యాదు కాపీని మెయిల్ చేశారు. ఈ నెల 4వ అర్థరాత్రి నుండి 5వ తేది తెల్లవారే సమయంలో తనను క్రైం నెంబర్ 147/2023లో అరెస్ట్ చేసిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారాం స్టేషన్ కు తీసుకెళ్లారని వివరించారు. ఈ క్రమంలో 7680006600 అనే నెంబర్ మొబైల్ ను తాను వినియోగిస్తున్నానని, ఇట్టి మొబైల్ ఫోన్ పోయిందని ఈ విషయం బొమ్మల రామారం తరలిస్తుండగా పోలీసు వాహనంలో ఉన్న అధికారులకు కూడా తెలియజేశానని సంజయ్ తెలిపారు. ఆ తరువాత కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన 60/2023 క్రైం నెంబర్ లో అరెస్ట్ చేసినప్పుడు కూడా తాను అడ్వకేట్లకు ఫోన్ పోయిందని చెప్పానని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయాన్ని న్యాయవాదులు కూడా బెయిల్ కోసం ఆర్గ్యూమెంట్స్ చేసినప్పుడు కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారని, తనను కరీంనగర్ లో కస్టడిలోకి తీసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ నాతో పాటే ఉందని బండి సంజయ్ వివరించారు. తన మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేసి వెతికి పెట్టాలని అందులో పలువురి కాంటాక్ట్ నెంబర్లతో పాటు ముఖ్యమైన సమాచారం ఉన్నందున మొబైల్ ను వెతికిపెట్టి ఇవ్వాలని కోరారు. అయితే ఇందులో వాడుతున్న సిమ్ మాత్రం తన సోదరి డాక్టర్ సౌమ్య పేరిట ఉన్నదని సెక్యూరిటీ కారణాల దృష్ట్యా తాను ఆమె పేరిట ఉన్న సిమ్ ను వాడుతున్నానని కూడా ఎంపీ బండి సంజయ్ ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే పోలీసులు ఫిర్యాదు అందుకున్న తరువాత టవర్ లోకేషన్ ను ట్రేస్ చేయడంతో పాటు మొబైల్ ఏ ప్రాంతం వరకు ఆన్ లో ఉంది.? అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉన్నట్టయితే మాత్రం దానిని దొరకబట్టే అవకాశాలు చాలా తక్కువేనని స్పష్టం అవుతోంది.
సీపీ రంగనాథ్ వెల్లడి…
బండి సంజయ్ అరెస్ట్ తరువాత వరంగల్ సీపీ రంగనాథ్ కూడా ఆయన మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదని, పోయిందని చెప్తున్నారని వివరించారు. అయితే ఫోన్ ఇస్తే తప్ప మరిన్ని వాస్తవాలు వెల్లడించే అవకాశం లేదని కూడా సీపీ మీడియాకు తెలిపారు. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం బండి సంజయ్ తన మొబైల్ ఫోన్ పోయిందని వెతికి పెట్టి ఇవ్వాలని కోరడం సరికొత్త చర్చకు దారి తీసినట్టయింది. ఇప్పటి వరకు బండి సంజయ్ కావాలనే ఫోన్ ను దాస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంపీ సంజయ్ స్వయంగా ఫోన్ ను ట్రేస్ చేసి ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.