శాతవాహనలో చల్లారని మంటలు… పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం

దిశ దశ, శాతవాహన యూనివర్శిటీ:

శాతవాహన యూనివర్శిటీలో రెండో రోజు కూడా మంటలు చెలరేగాయి. దీంతో యూనివర్శిటీ పేపర్ గోదాములో పేపర్లు దగ్దం అయ్యాయి. గురువారం మద్యాహ్నం యూనివర్శిటీ ఆవరణలోని చెట్లలో అగ్గి రాజుకోవడంతో ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పించారు. అయితే విశాలమైన ఆవరణలో మిగిలిన నిప్పు కణికలు క్రమక్రమంగా విస్తరిస్తూ శుక్రవారంవేకువ జాము వరకు యూనివర్శిటీ పేపర్ గోదాం వరకు చేరుకున్నాయి. అంతేకాకుండా విశ్వవిద్యాలయం ఆవరణలోని పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడింది. రెండో రోజున కూడా వివిధ రకాల చెట్లకు మంటలు అంటుకోవడంతో అవి కాలి బూడిదయిపోతున్నాయి. మళ్లీ ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వేసవి కాలం కావడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

రికార్డులు భద్రం: వీసీ ఉమేష్ కుమార్

పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల రికార్డులకు నష్టం ఏమీ జరగలేదని శాతవాహన యూనివర్శిటీ ఉమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఎగ్జామ్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ దగ్దం అయినప్పటికీ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటరైజ్ చేశామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీసీ వెల్లడించారు.

తరుచూ ప్రమాదాలు…

అయితే శాతవాహన యూనివర్శిటీలో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. సువిశాలమైన ఆవరణలో పెద్ద ఎత్తున పచ్చదనం పరుచుని ఉంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడల్లా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. దీంతో చెట్లు, కొత్తగా చిగురించే మొక్కలు, చెట్ల నుండి రాలి పడ్డ విత్తనాలు అన్ని కూడా మంటల్లో కాలి బూడిద అవుతున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు విద్యార్థులు కూడా భయం గుప్పిట కాలం వెల్లదీయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా పచ్చని చెట్లు భారీగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని జీవరాశులు కూడా అక్కడ ఆవాస ఏర్పర్చుకుంటుంటాయి. యూనివర్శిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో నెమళ్లతో పాటు పలు రకాల వన్యప్రాణుల ఉనికి కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా అవి ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకోసం అన్వేషించుకోవల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనివల్ల జీవ రాశుల ఉనికి కూడా ఇక్కడ ప్రమాదకరంగా మారిందని చెప్పక తప్పదు. అలాగే యూనివర్శిటీకి సంబంధించిన భవనాల వరకూ మంటలు విస్తరిస్తుండడం వల్ల వాటి అస్థిత్వానికి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. యూనివర్శిటీకి సంబంధించిన సామాగ్రితో పాటు రికార్డులు దగ్దం కావడం వల్ల ఆర్థిక భారం కూడా పడుతోంది.

శాశ్వత చర్యలు అవసరం…

శాతవాహన యూనివర్శిటీలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నివారణ కోసం శాశ్వత చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో కూడా రక్షణ చర్యలు తీసుకోవలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే స్పింకర్ల ద్వారా రోజూ నీటిని పిచికారి చేయించే విధంగా చొరవ తీసుకుంటే అగ్ని ప్రమాదాలకు తావు ఉండదు. దీనివల్ల యూనివర్శిటీ ఆవరణలోని పచ్చదనం ఎప్పటికీ ఫరిడవిల్లే అవకాశం ఉండడంతో పాటు పచ్చిక బయల్లు ఏర్పడుతుంటాయి. దీంతో విశ్వవిద్యాలయ ఆవరణలో అహ్లదకరమైన వాతావరణం ఆవిష్కృతం కానుంది. ఈ చెట్లలో అవాసం ఏర్పాటు చేసుకున్న జీవరాశులకు కూడా తాగు నీటిని అందించినట్టు అవుతుంది. గతంలో పర్క్యూలేషన్ ట్యాంకులు నిర్మించి నీటి నిలువను పెంచినట్టయితే బావుంటుందని కూడా విశ్వవిద్యాలయ అధికారులు చర్చించినప్పటికీ ఎందుకనో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. పర్క్యూలేషన్ ట్యాంకుల నిర్మాణం వల్ల గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నా వాటిని వెంటనే నిలువరించే అవకాశాలు కూడా ఉండేవి. ఇప్పటికైనా యూనివర్శిటీ ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూనివర్శిటీలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. స్పింక్లర్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను కెటాయించినా శాశ్వత పరిష్కారం లభించినట్టు అవుతుంది.

You cannot copy content of this page