కారులో మంటలు… కాలిపోయిన కరెన్సీ నోట్లు

మరో కారులో పరారైన ఘనులు

దిశ దశ, వరంగల్:

కారులో చెలరేగిన మంటలతో అందులో తరలిపోతున్న నగదు కూడా కాలిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం వరంగల్ జిల్లా మామునూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనల సంచలనంగా మారింది. కొద్ది సేపటి క్రితం మామునూరు మీదుగా ప్రయాణిస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు హుటాహుటిన కారు దిగి అందులో తరలిస్తున్న కరెన్సీ నోట్లను ఎస్కార్టుగా వస్తున్న మరో కారులోకి తరలించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే స్థానికులు కారు మంటలను ఆర్పడంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారును పరిశీలించి స్టేషన్ కు తరలించారు. అయితే కారు ఇంజన్ భాగంలో కరెన్సీ నోట్ల కట్టలను పెట్టడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని తెలుస్తోంది. అయితే కారులోని ఇతర చోట్ల దాచిన డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కరెన్సీ నోట్లు దగ్దం కాగా మరికొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొమ్ము రూ. 15 లక్షల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఎన్నికల డబ్బేనా..?

అయితే కారులో తరలిస్తున్న నగదు విషయంలో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అధికారిక లెక్కలతో సంబంధం లేకుండా ఉండేందుకు ఈ నగదును తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారుతో పాటు వచ్చిన మరో కారులోకి పెద్ద మొత్తంలో నగదును తరలించుకెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టానికి లోబడే నగదు తరలిస్తున్న వారియితే కారులోని రహస్య ప్రాంతాల్లో దాచే అవకాశం లేదని, మరో వైపున మంటలు చెలరేగిన వెంటనే కారును అక్కడే వదిలేసి పరార్ కావడం కూడా అనుమనాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన నగదే అయి ఉంటుందన్న అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే తాము పోలీసులకు చిక్కినట్టయితే ఆ డబ్బు ఎవరిదో తెలిసి పోతుందన్న కారణంగానే రెండు కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులు సేఫ్ గా ఉన్న మరో కారులో అక్కడి నుండి జంప్ అయ్యారని భావిస్తున్నారు. అయితే పోలీసులు కారు ఎటు వైపు వెల్లింది..? ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఫుటేజీ ఆధారంగా, లేనట్టయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కారు గురించి ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page