జయ జయ రామ, సీతారామా అంటూ అరవింద నేత్రుడిని కొలుస్తున్న ఆ భక్తుల నోట ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆలయంలో సీతా రాముల కళ్యాణం తాలుకు మంత్రోచ్ఛరణలు వినిపించాయి. అంతలో ఒక్కసారిగా పైన వేసిన చలువ పందిళ్లపై ఎగిసిపడుతున్న మంటల వేడితో అల్లాడిపోయారు భక్తులంతా. శ్రీ రామ నవమి పర్వదినం పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సంభవించడంతో చలువ పందిళ్లకు నిప్పంటుకుంది. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో భక్తులు ఒక్క సారిగా బయటకు పరుగులు తీశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామ స్వామి కళ్యాణోత్సవానికి హజరయ్యే భక్తుల కోసం ప్రత్యేకంగా చలువ పందిళ్లు వేశారు. కొద్ది సేపటి క్రితం టపాసులు కాల్చుతున్న క్రమంలో ఓ తారా జువ్వ చలువ పందిళ్లపై పడడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీతా రాముల కళ్యాణం తిలకించే భక్తులు ఒక్కసారిగా ఎగిసి పడిన మంటలను గమనించి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఫైరింజన్లను కూడా రప్పించి మంటలను ఆర్పే పనిలో నిమగ్నం అయ్యారు. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.