మంచిర్యాల జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. చుట్టపు చూపుగా వచ్చిన ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో సహా సజీవ దహనం కావడం స్థానికులను కలిచివేస్తోంది. చిన్నమ్మ ఇంటికి వచ్చి తన చిన్నారులతో పాటు సంతోషంతో గడపాలనుకున్న ఆ తల్లి కానరాని లోకాలకు చేరిన ఘటన అందరిని కన్నీటి పర్యంతం చేస్తోంది. రాష్ట్రంలోనే సంచలనం కల్గించిన ఈ ఘటన వెనక కారణాలు ఎలా ఉన్నా రామకృష్ణ కాలనీలో తల్లి పిల్లలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయారని తెలుసుకుని ఘటనకు కారకులైన వారిపై శాపనార్థాలు పెడుతున్నారు. వినడానికి అత్యంత బాధాకరంగా ఉన్న ఈ ఘటనలో ఇదే జిల్లా కోటపల్లి మండలం కొండంపేటకు చెందిన మౌనిక ఆమె కూతుళ్లు స్వీటీ (4), హిమ బిందు (2) కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. అభం శుభం తెలియని మౌనిక తన పిల్లలను వెంట పెట్టుకుని రెండు రోజుల క్రితమే రామకృష్ణాపూర్ మండలం వెంకటాపూర్ లోని చిన్నమ్మ ఇంటికి చేరుకుంది. రోజులాగానే శుక్రవారం రాత్రి భోజనాలు చేసి పడుకోగా అర్థరాత్రి మంటలు అంటుకోవడంతో ఇళ్లు దగ్దం అయిపోవడంతో అందులో మౌనిక ఆమె బిడ్డలు కూడా మృత్యువు కబలించడం స్థానికులు విషాదంలోకి నెట్టేసింది.
బలయింది ఎవరు..?
అభం శుభం తెలియని అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోవడం సరైంది కాదని స్థానికులు అంటున్నారు. ఆవేశంతో చేసిన తొందరపాటు చర్య వల్ల నిండు నూరేళ్లు బ్రతకాల్సిన ఇద్దరు చిన్నారులు, వారి తల్లి అగ్నికీలల్లో కాలిపోయారన్న విషయాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వివాహేతర బంధం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అయితే తప్పు చేసిన వారిని మాత్రమే దండించాల్సిందిపోయి ఇంటిల్లిపాదిని మట్టుబెట్టాలనే క్రూరత్వం మాత్రం సరైంది కాదని, తప్పు చేయని వారూ తనువు చాలించిన ఈ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలను తీసేంత దుస్సాహాసానికి ఒడిగట్టిన ఆ మూర్ఖులను చట్ట పరిధిలో శిక్షించేందుకు పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ బలైన అమాయకులు కుంటంబాల కన్నీటి రోధన తీర్చేవారెవరూ..? చట్ట పరిధిలో శిక్ష పడినా అమాయకులైన మౌనిక ఆమె కూతుళ్లు మరణించడంపై మాత్రం స్థానికులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మౌనికతో పాటు తమ కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలను కూడా కోల్పోవడంతో చుట్టపు చూపుగా వచ్చిన మౌనిక సంబంధం లేని విషయంలో చనిపోయిందని, ఆమె బిడ్డలనూ మృత్యువు బలితీసుకోవడం పట్ల ఆ దేవున్ని కూడా నిందిస్తున్న వారూ లేకపోలేదు.