దద్దరిల్లిన అడవులు
దిశ దశ, దండకారణ్య జోన్:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలోని డబ్బా మార్క్ నుండి సక్లైర్ వరకు జరిపిన కూంబింగ్ ఆపరేషన్లలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత లో భాగంగా 208 కోబ్రా, ఎస్టీఎఫ్, భద్రతా బలగాలు గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో సుమారు ఆరుగురు మావోయిస్టులు గాయాల పాలయ్యారని, వారు ఘటనా స్థలం నుండి తప్పించుకున్నారని పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలం నుండి బలగాలు బీజీఎల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఆ ప్రాంతంలో ఇంకా కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ దృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలైనట్టుగా, బీజీడీ పేలుడుతో జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసు అధికారులు మాత్రం దృవీకరించలేదు.