Maoist news: ఓ చోట పిలుపులు… మరో చోట కాల్పులు…

మావోయిస్టులపై పోలీసుల వ్యూహం…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకున్న మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఆయా రాష్ట్రాల పోలీసులు. అత్యంత బలోపేతంగా ఉన్న బస్తర్ అడవుల్లో నక్సల్స్ ఏరివేత కోసం పకడ్భందీగా వ్యవహరిస్తున్నారు.

చత్తీస్ గడ్ లో…

చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ తిరుగులేని పట్టు సాధించింది. అక్కడి ఆదివాసీలను అక్కున చేర్చుకున్న నక్సల్స్ సమాంతర ప్రభుత్వాన్నే కొనసాగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నాయి. అభూజామడ్, మాడ్ అటవీ ప్రాంతాల్లో బలగాలను పంపించి భారీగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్న నక్సల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 2026 మార్చి నాటికి లెఫ్ట్ వింగ్ నక్సలిజాన్ని అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కడ తరుచూ ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్న తీరు మావోయిస్టు పార్టీకి సవాల్ గా మారింది. బలగాలు చేరుకోలేవన్న ధీమాతో ఉన్న అటవీ ప్రాంతంలోకి కూడా కూంబింగ్ పార్టీలు సెర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. చివరకు బంకర్లలో షెల్టర్ తీసుకుంటున్న నక్సల్స్ కార్యకలాపాలను కూడా కట్టడి చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఎన్ కౌంటర్ తో పాటు తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన కమిటీ ఇంఛార్జీలను కూడా ఎన్ కౌంటర్ చేశాయి. సరిహద్దు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్ తో పాటు ఆయా రాష్ట్రాలు నక్సల్స్ ఏరివేత కోసం ఏర్పాటు చేసిన బలగాలు మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ సరిహధ్దుల్లోని కర్రి గుట్టలు, ఒడిషా సరిహధ్దుల్లోని మాడ్ ఫారెస్ట్, మహారాష్ట్ర సరిహధ్దుల్లోని భామ్రాఘడ్, నారాయణపూర్, దంతె వాడ సరిహద్దుల్లోని కీకారణ్యాలను కూడా బలగాలు జల్లెడు పడుతున్నాయి. దీంతో మావోయిస్టులు సేఫ్టీ జోన్లను ఎంచుకుని బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత భయానక పరిస్థితులు దండకారణ్యంలో నెలకొన్నాయంటే బలగాలు ఏ స్థాయిలో మావోయిస్టు ఏరివేత కొనసాగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏ క్షణంలో ఎన్ కౌంటర్ జరుగుతుందో తెలియని ప్రతికూల పరిస్థితులను మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటోంది.

తెలంగాణాలో…

తెలంగాణ పోలీసులు మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. విప్లవ పంథాలో కొనసాగుతున్న మావోయిస్టు పార్టీ నేతలను జనజీవన స్రవంతిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామగుండం సీపీ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు మావోయిస్టు పార్టీ నాయకుల ఇండ్లకు వెల్లి అరణ్యంలో సాయుధ పోరు చేస్తున్న వారి బిడ్డలను జనారణ్యంలో కలిసేవిధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అడవిలో అన్నలు బయటకు రావాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ద్వారా ప్రకటనలు చేయిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఆయుధం పట్టి అడవిలో తిరుగుతున్న వారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి సాధారణ జీవనం గడిపాలని కోరుతున్నారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఇటీవల జిల్లాలోని పంబాపూర్ గ్రామానికి వెళ్లారు. 32 ఏళ్లుగా సాయుధ పోరుబాటలో ఉన్న సోమన్న కుటుంబ సభ్యులను కలిసి ఆయనను లొంగిపోవాలని పిలుపునిచ్చారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(DKSZC)లో జిల్లా కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న సోమన్న రెండు రోజుల తరువాత భూపాలపల్లి ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. మిగతా అజ్ఞాత నక్సల్స్ నేతలను కూడా బయటకు రప్పించేందుకు ముమ్మరంగా పావులు కదుపుతున్నారు పోలీసు అధికారులు. లొంగిపోయిన తరువాత పునరావసం కల్పిస్తామని వారి కుటుంబాలకు అన్నింటా భరోసాగా ఉంటామని కూడా హామీ ఇస్తున్నారు ఆయా జిల్లాల పోలీసు అధికారులు. అయితే భద్రాద్రి జిల్లా సరిహధ్దు ప్రాంతంలో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆ ప్రాంతం మీదుగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న అజ్ఞాత నక్సల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ కమిటీకి చెందిన కీలక నాయకత్వం చనిపోగా అక్కడ అరెస్టులు, సరెండర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు ఓ వైపున లొంగుబాట్లు, ఎరివేత విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనవరి 1న కేంద్ర కమిటీ సభ్యుడు మలోజ్జుల వేణుగోపాల్ బార్య సిడాం విమల అలియాస్ తారక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయారు. మరో వైపున భామ్రఘడ్ సరిహధ్దు అడవుల్లో నక్సల్స్ క్యాంపులను ట్రేస్ చేసేందుకు సి60 బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

You cannot copy content of this page