దర్యాప్తు ముమ్మరం
దిశ దశ, పరకాల:
హన్మకొండ జిల్లా పరకాలలో కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బుధవారం ఫిర్యాదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఈ నెల 15న పరకాలలోని భూపాలపల్లి రోడ్డులో గల ఫంక్షన్ హాల్ లో తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపినట్టుగా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శివ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15వ తేదిన నగేష్ తండ్రి సంవత్సరీకం కార్యక్రమానికి హాజరైన ఎర్రబెల్లి సిద్దార్థ తిరుపతి రెడ్డి తన వద్ద ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలిసిందని ఆర్ఐ వివరించారు. బుధవారం రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరకాల పోలీసులు ఎఫ్ఆర్ నంబర్ 263/2023లో 336 ఐపీసీ, 25 ఆర్మ్స్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు పరకాల సీఐ వెంకటరత్నం కూడా కాల్పులు జరిగినట్టుగా చెప్తున్న ప్రాంతంలో ఆరా తీశారు. రియాల్టర్ గా జీవనం సాగిస్తున్న తిరుపతిరెడ్డిని పరకాల పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు గన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాన్ని పోలీసులు పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించే అవకాశాలు ఉన్నాయి. ల్యాబ్ లో నిపుణులు వెపన్ నుండి ఎన్ని రౌండ్ల తూటాలు బయటకు వెళ్లాయోనన్న విషయంపై నివేదికలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రియాల్టర్ గన్ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని రౌండ్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు, ఆయన ఎక్కడ రౌండ్లు కొనుగోలు చేశారు, వాటి బిల్లుల వివరాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రాణాలకు అపాయం లేకున్నా కాల్పులు జరపడం, స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి నేరాలపై లైసెన్స్ హోల్డర్ పై కేసులు నమోదు చేసేందుకు కూడా పోలీసు అధికారులు సమాయత్తం కానున్నారు. ఓ ఫంక్షన్ కు వచ్చి ఆయన కాల్పులు జరపడానికి కారణాలు ఏంటీ.. అన్న విషయంపై కూడా ఆరా తీసే అవకాశం లేకపోలేదు.
లైసెన్స్ ఇవ్వడం సరైందేనా.?
అయితే రియాల్టర్ తిరుపతి రెడ్డికి ఆయుధ లైసెన్స్ ఇవ్వడానికి బలమైన కారణాలు ఏంటీ అన్న చర్చకూడా మొదలైంది. ఆయన వ్యాపార లావదేవీల్లో కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని ఇచ్చారా లేక అతను టార్గెటా..? లేకపోతే అతన్ని హతమార్చేందుకు విఫలయత్నం జరిగిందా అన్న కారణాలు ఉన్నట్టయితేనే ఆయుధ లైసెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తిరుపతి రెడ్డికి లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారోనన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వ్యాపారి అన్న కోణంలో ఇచ్చినట్టయితే ఆయన ఆ మేర ఐటీ చెల్లిస్తున్నారా..? ఆయన చేసే వ్యాపారాలకు సంబంధిత శాఖల నుండి అనుమతులు తీసుకున్నారా..? తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా రియాల్టర్ తిరుపతి రెడ్డి చేతిలోని తుపాకి తూటాలు కక్కడం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.