తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న భయం…
దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ సరిద్దులు, బస్తర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంటోంది. కీకారణ్యాల్లో ఎన్ కౌంటర్ జరుగుతుందన్న సమాచారం అందగానే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కలవరం మొదలవుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా బస్తర్ అడవుల్లో విప్లవ పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీలో కీలక నాయకుల్లో ఎక్కువ మంది తెలుగు వారే ఉండడంతో ఈ ఆందోళనకు కారణమవుతోంది.
ముఖ్య నేతలు…
కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవ రావు, సీనియర్ నేత ముప్పాళ లక్ష్మణ్ రావు, మలోజ్జుల వేణుగోపాల్ రావు, మల్ల రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద రావు, ఒగ్గు సత్వాజి, బండి ప్రకాష్, ఆడెల్లు, బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు దండకారణ్యంలో మావోయిస్టు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో బస్తర్ అటవీ ప్రాంతంలో బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తుండడంతో తరుచూ ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి అటవీ ప్రాంతంలో సాయుధులుగా సంచరిస్తున్న మావోయిస్టు పార్టీతో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం తెలియగానే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఇటీవల కాలంలో అన్నె సాగర్, సుధాకార్ ఆయన భార్య, మధు, ఏసోబు, కాసరవేణి రవి, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిలు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో బస్తర్ అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో బలగాలను మోహరించి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తరుచూ ఎదురు కాల్పలు ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడల్లా అడవి బాట పట్టిన మావోయిస్టు నేతల కుటుంబాల్లో ఆందోళన నెలకొంటోంది.
ప్రచారాలు ఇలా…
ఇటీవల భద్రాద్రి జిల్లా సరిహధ్దుల్లోని చత్తీస్ గడ్ అడవుల్లో బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. ఈ ప్రాంతంలో బడే దామోదర్ షెల్టర్ తీసుకున్నాడన్న సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టిన నేపథ్యంలో ఆయన చనిపోయినట్టుగా ప్రచారం జరిగింది. పార్టీ నాయకురాలు గంగా పేరిట ఓ ప్రకటన కూడా విడుదల కావడంతో అంతా నిజమేనని నమ్మారు. ఆ తరువాత బడే దామోదర్ క్షేమంగానే ఉన్నాడన్న ప్రకటన వెలువడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు చనిపోయారన్న ప్రచారం జరిగింది. ఈ ఘటనలో కేంద్ర కమిటీ చలపతితో పాటు చత్తీస్ గడ్ కు చెందిన నక్సల్స్ మరణించినట్టు పోలీసు అధికారులు ప్రకటించడంతో వారంతా సేఫ్ గా ఉన్నారని తేలిపోయింది. నేషనల్ పార్క్ అడవుల్లో మద్దేడ్, పర్సెగూడ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనలో బండి ప్రకాష్, అడెల్లు ఉన్నారన్న ప్రచారం జరిగినప్పటికీ వారు తప్పించుకున్నారని పోలీసులు ప్రకటించారు. దండకారణ్యంలో ఎప్పుడు ఎదురు కాల్పులు జరిగినా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అడవుల్లో సంచరిస్తున్న తమ వారు క్షేమమేనా కాదా అన్న విషయంపై స్పష్టత వచ్చే వరకూ కూడా ఆయా కుటుంబాలతో పాటు విప్లవ అభిమానులు కలవరపడుతున్నారు.