దిశ దశ, కరీంనగర్:
కారు సర్కారు గద్దె దిగిపోయిన తరువాత రాష్ట్రంలోనే కరీంనగర్ ఘటన సంచలనంగా మారింది. భూ దందాలకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రంలోనే తొలి అరెస్ట్ కరీంనగర్ లోనే కావడం గమనార్హం. అందునా ఇద్దరు ప్రముఖ నాయకులకు సన్నిహితులని చెప్పుకుంటూ పబ్బం గడిపిన వారు అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
ఇద్దరూ ప్రముఖుల అనుచరులే..!
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన భూ దందాలకు సంబంధించిన ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు కూడా రాష్ట్రంలో ఫేమస్ ఫొలిటికల్ లీడర్ల నీడలో బ్రతుకు వెళ్లదీసిన వారే కావడం గమనార్హం. ఈ కేసులో అరెస్ట్ అయిన చీటి రామారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే వారని కరీంనగర్ లో టాక్. మరో నిందితుడు కార్పోరేటర్ తోట రాములు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడిగా ముద్ర పడ్డారు. భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో కరీంనగర్ పోలీసులు ఫస్ట్ కేసులోనే ఇద్దరు ప్రముఖ నాయకులకు సన్నిహితులుగా చెప్పుకుని పబ్బం గడుపుకున్న వారిద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం. దీంతో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న సంకేతాలు ఇచ్చారు కరీంనగర్ పోలీసులు. ఇంతకాలం కారు మాదే సర్కారు మాదే అన్న ధీమాతో వ్యవహరించిన వారి భరతం పట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కరీంనగర్ పోలీసులు చేతల్లోనే చూపించారు.
కఠినమైన వైఖరే…
ఇకపోతే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కబ్జాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించి తీరుతామని కరీంనగర్ పోలీసుల చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. బుధవారం అరెస్ట్ అయిన వారిపై పెట్టిన ఐపీసీ సెక్షన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రై నంబర్ 491/2023లో ఐపీసీ సెక్షన్ 120-B , 447, 427, 465, 467, 468, 471 r/w 34లలో కేసు నమోదు చేశారు. దీంతో బుధవారం అరెస్ట్ చేసిన చీటి రామారావు, తోట రాములలకు కరీంనగర్ కోర్టు ఈ నెల 31 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాము ఇలా వెల్లి అలా బెయిల్ పై వస్తామన్న ధీమా వ్యక్తం చేసేందుకు అక్రమార్కులకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఫిర్యాదులు ఎక్కువగా వస్తే..?
అయితే ఒకే భూదందాలతో పాటు ఇతరాత్ర అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై పలువురు బాధితులు ఫిర్యాదులు చేసినట్టయితే మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఇందుకు అనుగుణంగా హిస్టరీ షీట్లు, భూ కబ్జా దారుల జాబితాతో పాటు అవసరమైన పీడీ యాక్టు కూడా అమలు చేసేందుకు వెనుకాడే పరిస్థితి లేదని తెలుస్తోంది. అధికారిన్ని ఆడ్డుపెట్టుకుని సామాన్యులను జలగాల్లా పట్టి పీడించి వేధింపులకు గురి చేేస్తూ దందాలకు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్ట కూడదని కరీంనగర్ కొత్వాల్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. చట్టం కఠినంగా అమలయితేనే అక్రమార్కులు కనుమరుగై పోతారన్న ఆలోచనతోనే పోలీసు అధికారులు దూకుడుగా వ్యవహరించనున్నట్టుగా సమాచారం.
స్పెషల్ టీమ్ ఇదే…
ఇకపోతే ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వింగ్స్ కు భిన్నంగా ఈ విభాగానికి కొత్త పేరు పెట్టారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కాకుండా కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి ఈ దందాలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన బృందానికి ‘‘ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్’’(EOW) అని పేరు పెట్టారు. అంటే కేవలం కబ్జాలు, నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేయడం వంటి వ్యవహారాలే కాకుండా ఆర్థిక దందాలకు పాల్పడిన వారిపై కూడా కఠినంగా వ్యవహరించే ఉద్ధేశ్యంతోనే EOW ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
dishadasha
1234 posts