వన్ నేషన్… వన్ ఎలక్షన్
దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఈ నెల 23న వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ తొలి సమావేశం జరగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో 8 మంది సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ సమావేశంలో లోక సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయితీరాజ్ ఎన్నికలు ఏకకాలంలో జరపాలన్న నిర్ణయంతో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. జమిలీ ఎన్నికలు జరిపినట్టయితే అన్ని విధాల బావుంటుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికల విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే 12 రాష్ట్రాల ఎన్నికలను ఏక కాలంలో జరిపి మిని జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో కూడా కేంద్రం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై కూడా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈ నెల 23న జరిగే సమావేశంలో కులంకశంగా చర్చించనున్నారు. జమిలీ ఎన్నికలపై ఎలాంటి విధానంతో ముందుకు సాగాలోనన్న విషయాలపై ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షా, లోకసభ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్య సభలో ప్రతిపక్షనేత గులాం నబి అజాద్, ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్ కె సింగ్, లోకసభ మాజీ సెక్రటరీ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, విజిలెన్స్ మాజీ చీఫ్ కమిషనర్ సంజయ్ కొఠారిలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే లోకసభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కమిటీలో కొనసాగనని ఇప్పటికే ప్రకటించారు. ఆయన స్థానంలో మరోకరిని నియమిస్తారా లేక కమిటీని ఇలాగే కొనసాగిస్తారా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనా సెప్టెంబర్ 23న జమిలీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.