మేడిగడ్డపై మాత్రమే మేం విచారణ చేస్తున్నాం: విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద రెండో రోజు కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. కుంగుబాటుకు గురైన పిల్లర్లను సునిశీతంగా గమనించిన ఆయన లోపం ఎక్కడుంది అన్న కోణంలో ఆరా తీశారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేసిన డీజీ రాజీవ్ రతన్ సాంకేతికపరమైన అంశాలపై కూడా అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్యారేజ్ బ్యాక్ వాటర్ దిగువకు వదిలేయడంతో కుంగిపోయిన పిల్లర్ల వద్ద అసలేం జరిగింది..? లోపం ఏమిటీ అన్న విషయాన్ని అంచనా వేసే అవకాశం కూడా ఏర్పడింది. దీంతో ఆయా అంశాలపై డీజీ రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందంతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అయి సాంకేతికపరమైన విషయాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం.

మేడిగడ్డపైనే ఆరా: డీజీ రాజీవ్ రతన్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేజర్ డ్యామేజ్ అయిన మేడిగడ్డ బ్యారేజ్ గురించే ఆరా తీస్తున్నామని ప్రభుత్వం కూడా ఇదే అంశం గురించి తమను వివరాలు అడిగిందన్నారు. కుంగుబాటుకు కారణాలు ఏంటీ అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పుడే నిర్థారణకు రాలేమని, రికార్డులను కూడా పరిశీలించిన తరువాత స్పష్టత వస్తుందని రాజీవ్ రతన్ వివరించారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తరువాత లోపాల గురించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం గురించి వివరాలు సేకరిస్తున్నామని ఇలా వచ్చి అలా నిర్ధారించే అవకాశం మాత్రం ఉండదన్నారు. ఇప్పటికే చాలా డాటా సేకరించామన్నారు. ముందు మేడిగడ్డను బాగు చేసి దీని ద్వారా నీటిని ఎగువ ప్రాంతాలకు నీరు అందించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందన్నారు. ఏ లక్ష్యం కోసం అయితే ఈ బ్యారేజీని డిజైన్ చేశారే ఆ లక్ష్యం నెరవేరే దిశగా టెక్నికల్ యంత్రాంగం పనిచేయాల్సి ఉందన్నారు. బ్యారేజ్ ఎలా డ్యామేజీ అయింది, మెటిరియల్ ఏం వాడారు.. తదితర అంశాలన్ని కూడా రెండో ప్రాధాన్యత కింద తీసుకుంటున్నామన్నారు. ఏడెనిమిదేళ్ల నుండి నిర్మాణం జరిపిన ఈ ప్రాజెక్టకు సంబంధించిన రికార్డులను స్టడీ చేస్తే మాత్రమే లోపాలు గుర్తించలేమని, క్షేత్ర స్థాయి పరిశీలనతోనే వాస్తవాలను గమనించే అవకాశం ఉంటుందని, తన పర్యటనకు అదో కారణం కూడా అని రాజీవ్ రతన్ వివరించారు. ఇంజనీర్ల సలహాలు సూచనలు తీసుకోవడం, ఫీల్డ్ విజిట్ చేయడం వల్ల అసలైన కారణాలను గుర్తించవచ్చన్నారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలో ఏఏ డిజైన్ లలో నిర్మించారో అన్న విషయాలపై కూడా ఆరా తీస్తామన్నారు. క్షేత్ర స్థాయి పర్యటన మొదటి విడుత సాగుతోందని ఇప్పుడే లోపాలపై నిర్థారణ అయ్యే అవకాశం లేదని మూడు నుండి నాలుగు నెలల గడువు పడుతుందని ఇందుకు సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం మేడిగడ్డ ప్రాజెక్టుపైనే విచారణ జరుపుతున్నామని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ వెల్లడించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టయితే మిగతా పంప్ హౌజులు, బ్యారేజీల గురించి కూడా తాము విచారణ చేపడతామన్నారు. 

You cannot copy content of this page