వృద్ధుల సంరక్షణ కేంద్రం!
దిశ దశ: రాజన్న సిరిసిల్ల జిల్లా:
పేగు బంధం తెంచుకున్న బిడ్డలు వారి ఆలనా పాలనాను పట్టించుకోవడం లేదు. పేరెంట్స్ అంటేనే విరక్తిగా చూస్తున్న కొంతమంది కారణంగా పండుటాకులు విలవిలలాడుతున్నాయి. ‘అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు’ అన్న నానుడిని నిజం చేస్తూ తల్ల్లిదండ్రులను విస్మరిస్తున్నారు కొందరు. తమను పట్టించుకునే వారే లేరా అని తల్లడిల్లిపోతున్న వృద్దులను కాపాడుకోవాలని భావించారు మంత్రి కేటీఆర్. తన ఇలాకాలో ఇటువంటి పరిస్థితుల రాకూడదని వారి కోసం ప్రత్యేకంగా ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు. పండుటాకులు ఎండుటాకుల్లా గాలికి కొట్టుకపోయే పరిస్థితి దాపురించకూడదని భావించిన మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్దుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోనే తొలి కేంద్రం ఇదే కావడం విశేషం.
ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్…
ఇటీవల కాలంలో పేరెంట్స్ ను విస్మరిస్తున్న ఘటనలు కొకొల్లుగా జరుగుతున్నాయన్న విషయాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ ఈ పరిస్థితి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఎదురు కాకూడదని ఆలోచించారు. వృద్దాప్యంలో మానసిక క్షోభకు గురవుతున్న వారిని అక్కున చేర్చుకోవాలని భావించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్దుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసయించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేర్ సెంటర్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. స్థానికంగా ఉన్న ఎస్టీ వసతి గృహాన్ని రూ. 40 లక్షలతో బాగు చేయించి సంరక్షణ కేంద్రాన్ని తయారు చేయించారు. మొదటి విడుత దోమ తెరలతో కూడిన 20 పడక మంచాలను ఏర్పాటు చేశారు. పుస్తక పఠనం చేయాలని భావించే వారి కోసం ప్రత్యేకంగా గ్రంథాలయం, శారీరక, మానసికోల్లాసం యోగా, ఆటల కోసం ప్రత్యేక గదిని ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఇండోర్ గేమ్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చెస్, వైకుంఠపాళి, క్యారం బోర్డు తదితర గేమ్స్ కు సంబందించిన వస్తువులను అందుబాటులో ఉంచారు. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ తమ అనుభవాలను నెమరువేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వేదికను కూడా నిర్మించారు. ఫిజియో థెరఫీ పరికరాలు, టీవీలను కూడా ఏర్పాటు చేసి వృద్దులు సంతోషంతో కాలం వెల్లదీసే విధంగా ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. ఆవరణలో రంగు రంగుల పూల మొక్కలను నాటడంతో పాటు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు వీలుగా పార్కింగ్ తీర్చిదిద్దారు. భవనం గోడలపై రంగు రంగుల చిత్రాలను వేయించి మధుర స్చృతులను నెమరువేసుకునే పరిస్థితులను కల్పించారు. వృద్దులు కావడంతో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
రాష్ట్రంలోనే మొదటిది…
వృద్దప్యానికి చేరుకున్న వారు వయో భారంతో పాటు తమ బిడ్లలు విస్మరించారన్న వేదనలో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వృద్దుల సంరక్షణా కేంద్రం ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసింది మొదటిదని రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు తెలిపారు. వివక్షకు గురయ్యమన్న మానసిక ఆందోళనకు దూరంగా ఉండాలన్న లక్ష్యంతో నిర్మించిన ఈ కేంద్రం వారిని అక్కున చేర్చుకోవడంలోనూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
ఆచరణ అద్భుతం: మంత్రి కేటీఆర్
వృద్దులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకునేందుకు ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. పండుటాకులు మానసిక సంఘర్షణకు గురి కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడం ఓల్డ్ ఏజ్ లో ఉన్న వారంతా సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తారన్నారు. వారికి అన్ని విధాల సేవలందించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు.