దిశ దశ, ఏపీ బ్యూరో:
తమ కడుపు నింపుకోవడమే కాదు… తమ కుటుంబ సభ్యుల కడుపు నింపాలన్న తాపత్రయం వారిది… వరధ ఉధృతి కారణంగా చేపల వేటను తాత్కాలికంగా నిలిపి వేసిన మత్సకారుల ఆరాటం అంతా జీవిత పోరాటం కోసమే. కానీ ఆక్కడ పోటీ పడి నీటిలో ప్రయాణం చేస్తున్న తీరు చూస్తే మాత్రం ఏవైనా పోటీలు సాగుతున్నాయా అన్న రీతిలో జలాల్లో ముందుకు సాగుతున్నారు. వరద ఉధృతి కారణంగా శ్రీశైలం బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదిలిన సంగతి తెలిసిందే. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతమంతా పాలపొంగును మరిపించి… శ్రీశైలం మల్లన్న భక్తులను మురిపించింది. అయితే ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో దిగువ ప్రాంతానికి నీటిని వదిలేసే ప్రక్రియను నిలిపివేశారు. అధికారులు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగంలో జీవన పోరాటం ప్రారంభించారు మత్స కారులు. వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడంతో చేపలను వేటాడి తమ కుటుంబాలను పోషించుకోవాలన్న ఆతృతతో గేట్ల వైపు ప్రయాణం సాగిస్తున్నారు. ఓ వైపున ఒకటి రెండు గేట్లు ఎత్తి ఉన్నప్పటికీ దిగువ ప్రాంతానికి వచ్చి చేరుతున్న వరద నీటి వద్ద అయితే చేపలు ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయని వారు తెప్పలపై అటువైపుగా వెల్తున్నారు.
జీవన్మరణ పోరాటం…
సాధారణంగా క్రీడల్లో మాత్రమే ఇలాంటి పోటితత్వాన్ని గమనిస్తుంటాం. మనదేశంలో నీటిలో కనోయింగ్ కయాకింగ్, రోయింగ్, సేయిలింగ్, యాచింగ్ వంటి వాటర్ గేమ్స్ పోటీలను నిర్వహిస్తుంటారు. ఇందు కోసం నిర్వహాకులతో పాటు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు కూడా స్వీయ రక్షణ చర్యలు తీసుకున్న తరువాతే పోటీల్లో పాల్గొంటారు. సేఫ్టీ మేజర్స్ తీసుకున్నప్పటికీ ఒక వేళ క్రీడాకారులు ప్రమాదాలకు గురైతే వారిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కానీ అక్కడ మాత్రం పోటీలను మించిన జీవన్మరణ పోరాటం చేస్తున్నారు మత్సకారులు. స్వీయ రక్షణ చర్యలు తీసుకునే ఆర్థిక పరిస్థితి వారికి లేదు. తమ పూర్వీకుల నుండి నేర్చుకున్న ఈత మాత్రమే వారిని విశ్వాసంతో ముందుకు సాగేలా చేసింది. తెప్పలపై వరద ఉధృతిలో ఎదురీతను మరిపిస్తూ చేపల వేటను కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా మత్సకారులు శ్రీశైలం దిగువన వరద నీటిలో చేపలను పట్టేందుకు వెలుతున్న తీరు టూరిస్టులను ఆకర్షించింది కావచ్చు. కానీ వారి జీవన పోరాటం కోసం చేస్తున్న సాహసం మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వరద ఉదృతిలో కొట్టుకపోవడం… ఆ నీటి నుండి తమను తాము రక్షించుకోవడం తప్ప మరో దారి అయితే వారికి లేదు. అయినా తమ పొట్ట కూటికోసం మత్సకారులు సాహసోపేతంగా వ్యవహరించిన తీరు వెనక వారి కుటుంబాలను పోషించుకోవాలన్న ఆశయమే. తాము వేటాడి పట్టుకున్న చేపలను విక్రయించి ఆదాయం గడిస్తే తమ కుటుంబాలకు చేదోడుగా నిలుస్తుందన్న ఆశే వారిని ముందుకు నడిపిస్తోంది.