నేషనల్ పార్క్ ఎదురు కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి…

ఆయుధాలు స్వాధీనం…

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టు పార్టీ నక్సల్స్ చనిపోయినట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉండగా భారీగా ఆయుదాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ అందించిన వివరాల ప్రకారం… జిల్లాలోని బందెపా, కొరంజెడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు శనివారం బలగాలను కూంబింగ్ ఆపరేషన్ కోసం పంపించారు. ఆదివారం ఉదయం మావోయిస్టులు ఎదురు పడడంతో అడపాదడపా పలుమార్లు బలగాలకు, నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు సంభవించాయి. దాదాపు 3 నుండి 4 గంటల వరకు జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. అలాగే SLR రైఫిల్, BGL లాంఛర్, 12 బోర్ తో పాటు పేలుడు పదార్థాలు, మావోయిస్టు పార్టీకి చెందిన సాహిత్యం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

మావోయిస్టు లీడర్ అరెస్ట్…

మరో వైపున కంకేర్ జిల్లాలో మావోయిస్టు పార్టీ డీవీసీ, రావుఘాట్ ఏరియా ఇంఛార్జి మాల్తీ అలియాస్ రాజే అలియాస్ నిర్మల కాంగే (48)ని ఆమెకు షెల్టర్ ఇచ్చిన శ్యామ్ నాథ్ ఉసెండీని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కోయలిబెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. ఉత్తర్ బస్తర్ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నిర్మల కాంగే అరెస్ట్ మావోయిస్టు పార్టీకి నష్టం కల్గిస్తుందని బస్తర్ ఏరియా పోలీసు అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page