ఆరుగురి సజీవ దహనం కేసు
మూడోసారి పక్కా స్కెచ్ తో ఆరుగురి సజీవ దహనానికి పాల్పడ్డారని రామగుండం సీపీ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేది అర్థరాత్రి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపెల్లి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మర్డర్ మిస్టరీని పూర్వాపరాలను వెల్లడించారు. దాదాపు ఆరేళ్లుగా వైవాహిక బంధంతో ఒక్కటైన సృజనను కాదని పద్మతో శాంతయ్య సహజీవనం చేస్తున్నాడు. తమ ఆస్థులను, ఉద్యోగాన్ని, రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ను కూడా పద్మ కుటుంబానికే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అనుమానించిన సృజన ఎలాగైనా అతన్ని మట్టబెట్టాలని నిర్ణయించుకుంది. గతంలో భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకోవడం, కేసు నమోదు కావడం కౌన్సిలింగ్ నిర్వహించడం వంటివి కూడా జరిగాయి. అయితే సృజన మాత్రం తనకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే శాంతయ్యను, పద్మను మట్టుబెట్టాలని ప్లాన్ చేసి, లక్షెట్టిపేటకు చెందిన లక్ష్మణ్ కు తన మనసులోని మాట చెప్పడంతో ఆయన రమేష్ కు రూ. 4 లక్షల సుపారి ఇస్తామని చెప్పగా ఇందుకు అవసరమైన స్కెచ్ వేసి రంగంలోకి దిగారు.
రెండు సార్లు మిస్…
శాంతయ్యను హతమార్చేందుకు లక్ష్మణ్ ఇచ్చిన డబ్బు రూ. 40 వేలతో ఓ బొలేరో వాహనం కొనుగోలు చేసిన రమేష్ యజమానికి మిగతా రూ. లక్ష తరువాత ఇస్తానని చెప్పాడు. ఈ బొలేరో వాహనంతో రెండు సార్లు యాక్సిడెంట్ చేసి శాంతయ్యను చంపే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఓ సారి గుడిపెల్లి రహదారిలో ఢీ కొట్టగా బొలేరో వాహనమే బోల్తాపడిందని, మరోసారి మంచిర్యాల ఎస్ బిఐ ముందు ఆటోలో వెల్తుండగా ప్రమాదంలో చంపేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. దీంతో శాంతయ్యను ఎలాగైన చంపాలని భావించి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.
కత్తులతో దాడికి…
కత్తులతో దాడి చేసి చంపాలని నిర్ణయించుకుని కొనుగోలు చేసినప్పటికీ శాంతయ్యపై ఉన్న కత్తిపోట్లను చూసి మర్డర్ అని పక్కాగా గుర్తు పడతారని భావించి వాటిని లక్ష్మణ్ ఆఫీసులో పడేశారు.. చివరకు గుడిపెల్లిలోనే శాంతయ్యను మర్డర్ చేయాలని వ్యూహం రచించుకుని గ్రామానికి చేరుకుని వైన్ షాప్ వద్ద సమయ్య అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. శాంతయ్య, పద్మ కుటుంబ సభ్యుల కదలికలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందిస్తే రూ. 1.50 లక్షలు ఇస్తానని చెప్పడంతో సమ్మతించాడు. మాసు పద్మ, శాంతయ్యల కదలికల గురించి ఎప్పటికప్పుడు చేరవేసే విధంగా ఒప్పందం కుదరడంతో శుక్రవారం అర్థరాత్రి మర్డర్ ప్లాన్ కు స్కెచ్ వేశారు. ఈ మేరకు ఓ ఆటోను అద్దెకు తీసుకున్న రమేష్ నస్పూర్ వద్ద పెట్రోల్ కొనుగోలు చేసుకుని గుడిపల్లి శివార్లలోకి చేరుకున్నాడు. ఇన్ ఫార్మర్ సమ్మయ్యను పిల్చుకుని వివరాలు అడగగా ఇంట్లో శాంతయ్య, పద్మ ఆమె భర్త శివయ్యలు ఉన్నారని చెప్పడంతో క్యాన్లను తీసుకుని వచ్చి ఇంటి చుట్టూ, పైన పెట్రోల్ చల్లి, డోర్ల కింది నుండి కూడా ఇంటి లోపలకు పెట్రోలో పోసి నిప్పటించారు. పెట్రోల్ కావడంతో వెంటనే మంటల అంటుకోవడంతో ఇంట్లో ఉన్న ఆరుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అయితే మౌనిక ఆమె ఇద్దరు పిల్లలు కూడా శివయ్య ఇంట్లో ఉన్న విషయం తెలియకపోవడం వల్లే ఇంటిని దగ్దం చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఘటన తర్వాత సమ్మయ్య తన ఇంటికి వెల్లిపోగా రమేష్ మాత్రం కాలినడకన రసూల్ పల్లి వద్దకు చేరుకుని షేరింగ్ ఆటో ద్వారా మంచిర్యాలకు వచ్చాడు. అక్కడే ఉన్న లక్ష్మణ్ తో అన్ని విషయాలు చర్చించిన రమేష్ లు తమ ఇండ్లకు వెల్లిపోయారు.
తప్పని కేసు…
శాంతయ్యను హత్య చేసినా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు మొదటి నుండి చేసిన ప్రయత్నాలన్ని కూడా విఫలం అయ్యాయి. చివరకు ఇంటికి నిప్పంటించి ప్రమాద వశాత్తుగా జరిగిందని అందరూ భావిస్తారని అనుకున్నా పోలీసులకు చిక్కక తప్పలేదు. ఈ కారణంగానే రెండు సార్లు యాక్సిడెంట్ చేయాలని చూసి, మూడో సారి ఫైర్ యాక్సిడెంట్ చేసినా వారు మాత్రం కటకటాల పాలు కావల్సి వచ్చింది. ఇంటిల్లిపాదిని మట్టుబెట్టి తాము సేఫ్ గా ఉందామనుకుంటే ఈ కుట్రలో దాగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు గుర్తించారు.
8… 800
అయితే రియాల్టర్ లక్ష్మణ్, సృజనలు ఈ మర్డర్ స్కెచ్ లో భాగంగా పకడ్భందీగానే వ్యవహరించారు. ప్రొపెషనల్ కిల్లర్స్ ను మరిపించే విధంగా వీరు వేసిన స్టెప్స్ చూస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే ఆశ్చర్యపోయి ఉంటారనుకుంటా. శాంతయ్యను చంపేందుకు వేసిన వ్యూహంలో బొలేరా వాహనం కొనుగోలు చేసి ప్రమాదం చేయాలని విఫలం అయిన వీరు ఎవరికీ అంతు చిక్కని మరో కోణంలోనూ ముందుకు సాగారు. గత ఆగస్టు నుండి వీరు ఫోన్లు మాట్లాడుకోవద్దని నిర్ణయించుకున్నారు. హత్య పథకం అమలు అయ్యే వరకు ఫోన్లలో మాట్లాడుకోకుండా ఉంటే పోలీసుల విచారణలో చిక్కే అవకాశమే లేదని అంచనా వేసుకున్నారు. అయితే సజీవ దహనం తరువాత పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టినప్పుడు వీరి కాల్ డాటా రికార్డ్ (సీడీఆర్) కూడా తెప్పించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు అంటే 8 నెలల పాటు 800 సార్లు ఫోన్లు మాట్లాడుకున్న లక్ష్మణ్, సృజనలు సడన్ గా ఫోన్ లో కాంటాక్ట్ కావడం మానేశారు. దీంతో ఎందుకిలా చేశారని వారిని పోలీసులు అడగగా మర్డర్ స్కెచ్ లో భాగమేనని, తాము చట్టానికి చిక్కకూడదన్న కారణంతోనే ఫోన్లలో మాట్లాడుకోవడం మానేశామని చెప్పారు.
వారు అమాయకులే…
అయితే ఈ కేసులో సృజన పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండగా, కూతురు ఎంబీఏ కంప్లీట్ చేసిందని వీరి భాగస్వామ్యం ఏ మాత్రం లేదని తమ దర్యాప్తులో తేలినట్టు సీపీ చంద్ర శేఖర్ రెడ్డి చెప్పారు. అయితే ఇందుకు సహరించిన సృజన తండ్రి అంజయ్య కుట్ర కేసులో భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఐదుగురు నిందిుతలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చనున్నామని, త్వరలోనే వీరిని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తమాని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేష్, CI ప్రమోద్ రావులు పాల్గొన్నారు.