ఆరుగురిని చంపిన ఐదుగురు… ప్రశాంత్ లోని ఆశాంతే అసలు కారణం…

ఆస్థిపై కన్నేసి వ్యూహం పన్ని…

ఎస్సీ సింధూ శర్మ వెల్లడి

దిశ దశ, కామారెడ్డి:

స్నేహితుడికి ఎదురైన పరిస్థితులను తనకు ఆసరాగా చేసుకుని కుటుంబాన్నంతా మట్టుబెట్టాడు. ఇందుకు తల్లి, తమ్ముడితో పాటు మరో ఇద్దరి సహకారంతో ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాడు. కుటుంబ సభ్యులకే అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డ ఆ నేరస్థుల ముఠా గుట్టును కాల్చేసిన శవం ఆధారంగా పోలీసులు రట్టు చేశారు. సీరియల్ కిల్లర్ ముఠా గురించి ఆరా తీసిన పోలీసులు డిటెక్టివ్ సీరియల్ ను మరిపించిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక హత్య మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరు హత్యలు జరిగాయని గుర్తించారు. కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరంభం అక్కడి నుండే…

ఈ నెల 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మాజివాడ, గాంధారి రోడ్డులోని భూంపల్లి సమీపంలో గుర్తు తెలియని యువతి శవాన్ని అగంతకులు కాల్చి వేశారని పోలీసులకు సమాచారం అందింది. పెట్రోల్ పోసి తగలబెట్టిన శవం ఎవరిది అన్న కోణంలో విచారించడం మొదలు పెట్టిన పోలీసులు హత్యకు పాల్పడిన నిందితుల గురించి కూడా ఆరా తీయడం మొదలు పెట్టారు. అనుమానితులపై కన్నేయడంతో పాటు సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని దర్యాప్తు చేపట్టారు సదాశివనగర్ పోలీసులు. మక్లూరుకు చెందిన పూనే ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్నాడు. గతంలో దుబాయికి వెళ్లి వచ్చిన ప్రసాద్ తన స్నేహితుడైన మేడిద ప్రశాంత్ వద్ద రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే దుబాయి నుండి వచ్చిన తరువాత ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. జైలు నుండి బయటకు వచ్చిన ప్రసాద్ తన కుటుంబ సభ్యులను గ్రామంలో ఉండవద్దని మక్లూరు గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో ప్రసాద్ కుటుంబ సభ్యులంతా కూడా మాచారెడ్డి సమీపంలోని పాల్వంచలో నివాసం ఉంటున్నాడు. అయితే దుబాయిలో ఉన్నప్పుడు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రసాద్ పై ప్రశాంత్ తరుచూ ఒత్తిడి చేసేవాడు. అయితే మక్లూరులోని ఇంటిపై మార్ట్ గేజ్ లోన్ తీసుకోవచ్చని ప్రశాంత్ సలహా ఇవ్వడంతో పాటు ఆస్థిని తనపేరిట బదిలీ చేస్తే రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ప్రసాద్ తనకు చెందిన ఆస్థిని ప్రశాంత్ పేరిట మార్పించిన తరువాత కాలయాపన చేస్తూ దాటవేస్తూ వస్తుండడంతో ప్రశాంత్ పై ప్రసాద్ ఒత్తిడి చేయసాగాడు. తన ఆస్థిని తనపేరిట అయినా మార్చాలని లేనట్టయితే మిగతా డబ్బు అయినా ఇవ్వాలని ప్రసాద్ ప్రశాంత్ ను నిలదీయసాగాడు. దీంతో ప్రసాద్ ను హతం చేసినట్టయితే తనకు ఆస్థి మిగులుతుందన్న దురాశతో ప్రశాంత్ వ్యూహం ప్రకారం ఒక్కొక్కరిని చంపేందుకు పథకం రచించాడు.

అవే అతని ఆయుధంగా…

అయితే మృతుడు ప్రసాద్ పై కేసు ఉండడం… గ్రామంలోకి అతన్ని రానిచ్చే పరిస్థితి కూడా లేకపోవడం కూడా తనకు లాభిస్తుందని ఆశించాడు. ఈ రెండు కారణాలను గమనించిన ప్రశాంత్ ప్రసాద్ అతని కుటుంబ సభ్యులను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఈ హత్యల కోసం తన స్నేహితులు అయిన దుర్గానగర్ తండాకు చెందిన బానోతు వంశీ, గుగులోతు విష్షుల సాయం కూడా తీసుకున్నాడు. తాను చేసే హత్యలకు సహకరించినట్టయితే రూ. 60 వేలు ఇస్తానన్న ఒప్పందం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో హత్యలు చేస్తే పోలీసులకు ఈజీగా దొరికే అవకాశం ఉంటుందని భావించిన ప్రశాంత్ పోలింగ్ అయ్యే వరకూ తన స్కెచ్ అమలు చేయకూడదని భావించాడు. అయితే ప్రసాద్ నుండి రోజు రోజుకు ఒత్తిడి పెరిగిపోతుండడంతో హత్యల కోసం వేసుకున్న పథకాన్ని అమలు చేయకతప్పదని భావించాడు. నవంబర్ 29న మక్లూరు గ్రామానికి వచ్చిన ప్రసాద్ తన ఆస్థి తాలూకు మిగతా డబ్బులు ఇవ్వాలని నిలదీశాడు. వెతకబోయే తీగ కాలికి తగిలిందనుకున్న ప్రశాంత్ వెంటనే వంశీ, విష్ణులకు సమాచారం చేరవేసి వారిని మక్లూరుకు రప్పించాడు. నలుగురు కలిసి నిజామాబాద్ కు వెల్లి ఒక కారును అద్దెకు తీసుకుని సాయంత్రానికల్లా మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామ శివార్లలోకి చేరుకున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రసాద్ కు మద్యం తాగించిన తర్వాత ముగ్గురు కలిసి ప్రసాద్ తలపై కర్ర, రాళ్లతో కొట్టి చంపేసి అక్కడే చెట్ల పొదల్లో పడేశారు. అర్థరాత్రి తర్వాత గ్రామంలోకి వెళ్లి పార, గడ్డపార తీసుకువచ్చి అక్కడే గోతి తవ్వి ప్రసాద్ శవాన్ని పాతిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ప్రసాద్ మిస్సయిన విషయం గురించి అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రశాంత్ డిసెంబర్ 1న పాల్వంచకు కారులో వెల్లి ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారని అతన్ని ఓ రహస్య ప్రాంతంలో దాచిపెట్టానని చెప్తాడు. ప్రసాద్ ను కలిసేందుకని చెప్పి అతని భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిలను తీసుకొని నిజామాబాద్ చేరుకున్నాడు. నిజామాబాదు పట్టణంలో ప్రసాద్ చెల్లెలు శ్రావణిని ఒక చోట ఉండాలని చెప్పి అతని భార్య శాన్వికను భర్త దగ్గరికి తీసుకువెళ్తానని నమ్మించాడు. ప్రశాంత్ అతని స్నేహితులు వంశీ, విష్ణులు కలిసి శాన్విక ను బాసర బ్రిడ్జి వైపు తీసుకెళ్లి మార్గమధ్యలో ఆమె గొంతుకు తాడుతో ఉరి వేసి చంపి బాసర బ్రిడ్జిపై నుండి నీటిలోకి తోసేశారు. ఆ తర్వాత శ్రావణి వద్దకు వచ్చిన ముగ్గురు శాన్వికను ప్రసాద్ దగ్గర వదిలి వచ్చామని ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పి కారులో తీసుకెళ్లారు. మార్గ మధ్యలో శాన్వికను చంపినట్టుగానే శ్రావణికి ఉరివేసి చంపి చేగుంట మండలం వడియారం సమీపంలోని రోడ్డు పక్కన పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ వాళ్ళ అమ్మ సుశీల, అతని పిల్లలు చైత్రికా, చైత్రిక్, మరో చెల్లెలు స్వప్నలు వద్దకు వెల్లిన నిందితులు పాల్వంచ లో ఉన్నట్టయితే పోలీసులు పాత కేసు విషయంలో తీసుకుపోయే ప్రమాదం ఉంటుందని భయపెట్టడంతో పాటు మిగతా కుటుంబ సభ్యులంతా నిజామాబాద్ లో ఉన్నారని వారితో చెప్పారు. దీంతో ప్రశాంత్ మాటలు నమ్మిన వారంతా కారులో నిజామాబాద్ కు వెళ్లగా రైల్వే స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ లాడ్జిలో వారిని దింపాడు. అయితే ఈ ఎపిసోడ్ గురించి ప్రశాంత్ ముందుగానే తన తల్లి వడ్డమ్మకు వివరించి హత్యలు చేసేందుకు తనకు సహకరించాలని కోరడంతో ఆమె కూడా ఒప్పుకుని అన్నపూర్ణ లాడ్జికి చేరుకుంది. డిసెంబర్ 4న ప్రసాద్ పిల్లల్ని చూడాలనిపిస్తోందంటున్నాడని సుశీల, స్వప్నలకు చెప్పి వారికి వడ్దమ్మ ను కాపాలగా ఉంచి పిల్లలను తీసుకొని ప్రశాంత్ అతని తమ్ముడు(మైనర్)లు కారులో బయలుదేరుతారు. నిజామాబాద్ నుండి సోన్ బ్రిడ్జి వైపు పిల్లలను తీసుకువెళ్లి మార్గమధ్యలో ఇద్దరు పిల్లల యొక్క గొంతు నులిమి చంపి గోనె సంచుల్లో కట్టి సోన్ బ్రిడ్జి మీది నుండి మృతదేహాలను పడేశారు. ఆ తర్వాత లాడ్జిలో ఉన్న సుశీలతో, ప్రసాద్, అతని భార్య పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారని, వాళ్ళ దగ్గరికి మనం తర్వాత వెళ్దామని చెప్పి సుశీలను మరియు ఆమె కూతురు స్వప్నను లాడ్జిలోనే ఉంచారు. డిసెంబర్ 13న ప్రశాంత్, అతని తమ్మడు, వంశీలు కలిసి లాడ్జ్ లో ఉన్న స్వప్నను కారులో ఎక్కించుకొని గాంధారి రోడ్డులోని భూంపల్లి శివారులోకి చేరుకుంటారు. అప్పటికే ఆమెను కారులో గొంతు నులిమి చంపేసిన నిందితులు శవాన్ని రోడ్డు పక్కన గుంత వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోయారు. 14వ తేది ఉదయం గుర్తు తెలియని యువతి శవాన్ని కాల్చివేశారన్న సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసులు ఒక్కో ఆధారం సంపాదిస్తూ మిస్టరీ మర్డర్ కేసును ఛేదించారు. ఈ కేసు పరిశోధనలో సీఐ రమణ నేతృత్వంలో ఎస్ఐ రాజు, హెచ్ సి అశోక్, పీసీలు జానకీరాం, రవి కుమార్, అబ్దుల్ హమీద్, శశికాంత్, నరేష్, సుధాకర్ రెడ్డి, రవి, రాజేందర్, హోం గార్డు అరుణ్ లు బృందాలుగా ఏర్పడి సీరియల్ కిల్లర్స్ టీమ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

You cannot copy content of this page