కరీంనగర్ ఎసీబీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు
దిశ దశ, కరీంనగర్:
ఓ కేసులో నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చే విషయంలో లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడిన ఇన్సె పెక్టర్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్ట్. ఈ మేరకు బుధవారం స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ ఇన్సెపెక్టర్ చింతల లచ్చన్నకు అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఏసీబీ స్పెషల్ కోర్ట్ పీపీ పి కిషోర్ కుమార్ ప్రాసిక్యూషన్ తరుపున వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్వాపరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా వాంకిడీ పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 14/2013, సెక్షన్ 354, 448 ఐపీసీలో నిందితునిగా ఉన్న ఉప్పల కృష్ణను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించేందుకు అప్పుడు ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న చింతల లచ్చన్న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. నిందితుని తల్లి ఉప్పుల శశికళ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అప్పుడు కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న టి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇన్సె పెక్టర్ లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ను ఇన్స్ పెక్టర్ రమణ మూర్తి కోర్టులో దాఖలు చేయగా ప్రస్తుతం ఈ కేసు ఐఓగా ఇన్స్ పెక్టర్ వై కృష్ణ కుమార్ వ్యవహరిస్తున్నారు. 2013లో జరిగిన ఈ ఏసీబీ ట్రాప్ కు సంబంధించిన తీర్పుపై ప్రత్యక్ష్య సాక్షుల నుండి సేకరించిన వాంగ్మూలాలు, ఏసీబీ అధికారులు కోర్టు ముందు ఉంచిన ఆదారాలను పరిశీలించిన కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. చింతల లచ్చన్నకు రూ. 12 వేల జరిమానా కూడా విధించింది.