దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తీగల వంతెన ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. మానేరు డ్యాంనకు దిగువన నిర్మించిన తీగల వంతెనతో కరీంనగర్ సరికొత్త శోభను అందిపుచ్చుకోనుంది. తీగల వంతెన నిర్మాణంతో రెండు వైపులా అప్రోచ్ రోడ్డు కంప్లీట్ కావడంతో ప్రారంభోత్సవం చేసి వంతెన మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ రాక…
తీగల వంతెనను ఈ నెల 17న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ను తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని అభ్యర్థించారు. మంత్రి కేటీఆర్ ఇందుకు సమ్మతించడంతో 17న వంతెన ప్రారంభోత్సవానికి ముస్తాబు కానుంది. మంత్రి గంగుల కమలాకర్ వెంట ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకు రవిశంకర్, జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ లు కూడా ఉన్నారు.
కొత్త వంతెన…
దశాబ్దాల క్రితం కరీంనగర్, వరంగల్ కు ప్రధాన రహదారిగా వినియోగంలో ఉండేది ప్రస్తుతం తీగల వంతెన నిర్మించిన ప్రాంతం. అక్కడ లో లెవల్ కాజ్ వే నిర్మాణం జరపగా దాని మీదుగా వాహనాలు కరీంనగర్ వరంగల్ కు రాకపోకలు సాగిస్తుండేవి. అయితే అల్గునూరు వద్ద హై లెవెల్ వంతెన నిర్మించడంతో ఈ రహదారి వినియోగంలో లేకుండా పోయింది. అయితే తాజాగా నిర్మించిన తీగల వంతెనతో మళ్లీ ఆ రహదారిని పునరుద్దరించినట్టయింది. అయితే వంతెన నిర్మాణం ప్రారంభించిన తరువాత కూడా కొన్ని రోజుల పాటు వాహనాల రాకపోకలను నియంత్రించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తుది మెరుగులు దిద్దుకున్న తరువాత వాహనాలను అనుమతించనున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం ఈ నెల 17 మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post