దిశ దశ, అంతర్జాతీయం:
పార్లమెంటు అనగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం… దేశ స్థితిగతులపై చర్చలతో దద్దరిల్లుపోతుందనేది వాస్తవం. కానీ ఆ దేశ పార్లమెంటులో మాత్రం ఓ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. మనషులతో ఎదురయ్యే సమస్య అయితే చట్టాలకు పని చెప్పవచ్చు కాని ఎలుకలు తెచ్చి పెట్టిన ఈ తంటాకు విముక్తి చెప్పడం ఎలా అని మల్లగుల్లాలు పడ్డారు. ఇది ఎక్కడో కాదు… దాయది దేశమైన పాకిస్తాన్ పార్లమెంట్ భవన్ పరిస్థితి. పార్లమెంటు భవనంలో సెక్యూరిటీ అధికారులను మించినంత సంఖ్యలో ఎలుకలు తయారయ్యాయట. అయితే ఇవి దేశ అత్యున్నతమైన సభలో తయారు చేసిన చట్టాలు, ఇతర రికార్డులకు సంబంధించిన ఫైళ్లను కొరికేస్తూ కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో వాటిని సమూలంగా నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ ఫైళ్ల కోసం వెతికినప్పుడు…
2008 సంవత్సరానికి సంబంధించిన ఫైళ్లలోని రికార్డుల కోసం వెతికినప్పుడు పార్లమెంటు భవనంలో తిష్టవేసిన ఎలుకల గురించి వెలుగులోకి వచ్చిందట. పార్లమెంట్ యంత్రాంగం భద్రంగా దాచిపెట్టిన ఫైళ్లను తింటూ దర్జాగా బ్రతికేస్తున్న ఎలుకలు బలిష్టంగా మారిపోగా… ఆ దేశానికి సంబంధించిన రికార్డులు ఎందుకూ అక్కరకు రాకుండా పోయాయి. దఫైళ్లలోని పేపర్లను ఎక్కడికక్కడ కొరికేయడంతో ఎలకలు సృష్టించిన బీభత్సం ఎంటో అర్థం అయింది అక్కడి అధికారులకు. దీంతో ఎలుకల బాధ నుండి విముక్తి కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అక్కడి అధికారులు. ఈ మేరకు ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదనలు పెట్టడంతో ముందు ఎలుకల భరతం పట్టిన తరువాతే మిగతా సంగతి ఏదైనా అని నిర్ణయించింది సర్కార్..
రంగంలోకి పిల్లులు…
పాకిస్తాన్ పార్టమెంటు భవనంలో రాజ్యమేలుతున్న ఎలుకలను సమూలంగా తొలగించాలని నిర్ణయించిన సర్కార్ ఇందు కోసం రూ. 12 లక్షల రూపాయల బడ్జెట్ కూడా కెటాయించింది. పార్లమెంట్ భవనం కిటికీలకు ప్రత్యేకంగా నెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు పిల్లులను అక్కడ వదిలేసి ఎలుకలను పట్టుకునే పని అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం పిల్లులను రంగంలోకి దింపేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో కూడా యంత్రాంగం నిమగ్నం అయింది. అయితే అక్కడి అధికార వర్గాల కథనం ప్రకారం మాత్రం పార్లమెంటు భవన్ లో తిష్ట్ వేసిన ఎలుకలు మాత్రం పిల్లుల కన్నా పెద్దవిగా తయారయ్యాయని స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలుకలను పట్టుకునే పిల్లులు ఎంత బలిష్టంగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్నేళ్లుగా పార్లమెంటు భవనంలో ఏర్పడిన ఎలుకలు పిల్లుల ఉనికిని గమనించి కలుగులోకి వెల్లి దాక్కుంటే అవి బయటకు రావడం ఎలా వాటిని పట్టుకోవడం ఎలా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది.