వెలిసిన ప్లెక్సీలు…
దిశ దశ, కరీంనగర్:
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ బండి సంజయ్ ప్రకటిస్తున్న క్రమంలోనే ప్రగతి భవన్ లో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య సయోధ్య వాతావరణంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ అనుబంధంపై కరీంనగర్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. పలు చోట్ల వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో యాక్షన్, రియాక్షన్ అంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం. మైనార్టీ ఓటు బ్యాంకును డైవర్ట్ చేయడంలో కీలక భూమిక పోషించే ఎంఐఎంతో దోస్తానా కోసం మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా అసదుద్దీన్ ఓవైసీ, కరీంనగర్ నేత గులాం ఆహ్మద్ లతో చర్చలు జరిపారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేకు కూడా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నాననంటు ప్రకటించిన వెంటనే కరీంనగర్ లో మైనార్టీ ఓట్లను ప్రభావితం చేసేందుకు ఎంఐఎం నేతలతో నెలకొన్న విబేధాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు భేటీ అయ్యారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ లోని పలు చోట్ల బీజేపీ కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్ పేరిట ఫ్లెక్సీలు వెలియడంతో మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి పంపించే ప్రయత్రం చేసినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల వాతావరణం నెలకొన్న క్రమంలో అటు బీజేపీ, ఇటు ఎంఐఎంలు మత ప్రాతిపాదిక ఓట్లే టార్గెట్ చేసుకుని పావులు కదుపుతున్నారన్నది మాత్రం వాస్తవం. ముస్లిం ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మల్చుకున్న ఎంఐఎంతో బీఆర్ఎస్ పార్టీ చేతులు కలపడంతో హిందువుల గుండెల్లో ఈ అంశాన్ని నింపే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు స్పష్టం అవుతోంది.