కరీంనగర్ లో ఫ్లెక్సీ వార్
దిశ దశ, కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ నియోజకవర్గంలో వెరైటీ ఫ్లెక్సీలు వెలిశాయి. తమ గ్రామంలోకి కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ లేదంటూ ప్రతి ఊరిలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో 95 శాతం రైతులు మూడు ఎకరాల వరకు ఉన్న వారేనని వారికి మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కరీంనగర్ లో మాత్రం కాస్త వైవిద్యంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తమ గ్రామంలోకి ప్రవేశం లేదు… ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ ముద్రించిన ఫ్లెక్సీలు ఆయా గ్రామాల రైతుల పేరిట వెలిశాయి. ఓ వైపున టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్న క్రమంలోనే మరో వైపున ఫ్లెక్సీలు వెలియడం సంచలనంగా మారింది. బుధవారం మద్యాహ్నం నుండి గ్రామా గ్రామన వెలిసి ఈ ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. రైతుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీపై వారు అసహనంతో ఉన్నారన్న సంకేతాలను పంపించేందుకు వీటిని ఏర్పాటు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నాయకులే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఫ్లెక్సీల చింపివేత…
కరీంనగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వెలిసిన ఈ ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రాత్రి చింపేశారు. ఫ్లెక్సీలు వెలిసిన గ్రామాల్లోకి రాత్రి వెళ్లి వాటిని తొలగించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెన్నేని రోహిత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేయడంతో ఇక్కడ ఫ్లెక్సీ వార్ మొదలైనట్టయింది. ఊరూరు తిరుగుతూ ఫ్లెక్సీలను తొలగించే పనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిమగ్నం కావడం గమనార్హం.
మల్లన్న సాగర్ ను మరిపించారా..?
అయితే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మల్చుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నది. కరీంనగర్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించి రైతుల పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ కోసం జరిపిన భూ సేకరణకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన విషయం అందరికీ తెలిసిందే. నిర్వాసిత గ్రామాలకు వెల్లి ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టేందుకు సమాయాత్తం అయ్యాయి. ఈ క్రమంలో మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో బోర్డులు వెలిశాయి. తమ గ్రామంలోకి ప్రతి పక్ష పార్టీలకు ప్రవేశం లేదంటూ గ్రామస్థుల పేరిట బోర్డులు వెలిశాయి. ఇప్పుడు కూడా కరీంనగర్ పల్లెల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రైతుల పేరిట కాంగ్రెస్ పార్టీకి ప్రవేశం లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.